ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా పురస్కార ప్రదానోత్సవం కోసం అమెరికా లాస్ ఏంజిల్స్‌కు వెళ్లిన రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు అక్కడ ఓ ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను అమెరికన్లతో పంచుకున్నారు. ఇక సినిమాలో పులితో జరిగిన ఫైట్ సీన్స్‌ను ఉద్దేశిస్తూ.. నిజంగా పులితో ఫైట్ చేయాల్సి వస్తే మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సేపు తలపడతారు? అని యాంకర్ అడగ్గా.. అదే నిజంగా జరిగితే మేమిద్దరం ముందే అక్కడి నుంచి పారిపోతాం అంటూ తారక్ నవ్వులు పూయించారు. అనంతరం రామ్ చరణ్‌తో స్నేహ బంధంతోపాటు సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ హీరోలిద్దరూ బయటపెట్టారు.
గర్వంగా ఫీలవుతున్నాం: జూ. ఎన్టీఆర్
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకల్లో భాగంగా మేము ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. సాధారణంగా కుటుంబంతో కలిసి అమెరికాకు హాలిడే ట్రిప్‌కు వస్తుంటాం. కానీ, ఈ సారి ప్రత్యేకంగా సినిమా కోసం రావడం థ్రిల్లింగ్‌గా ఉంది. భారతీయులుగా ఈరోజు ఇంతటి ఆదరణ పొందుతున్నందుకు ఎంతో గర్వంగానూ ఉంది.
ఇప్పటికీ కలగానే ఉంది: రామ్ చరణ్
లాస్ ఏంజిల్స్ స్టూడియోలో ఉన్నానంటే ఇంకా నమ్మలేకపోతున్నా. ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక్కటవుతోంది. అదే విధంగా భాషా పరమైన వ్యత్యాసాలు లేకుండా సినిమా అనేది ఒకే తాటి మీదకు వస్తోంది. ఇక్కడి ప్రజలు స్నేహపూర్వకంగా ఉన్నారు. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు.
తారక్ ఎంతో కష్టపడ్డాడు: రామ్ చరణ్
క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ భుజాల మీద నేను కూర్చొని ఫైట్స్ చేస్తుంటాను. ఆ సీన్ మా ఇద్దరికీ ఎంతో కష్టంగా అనిపించింది. ముఖ్యంగా తారక్ ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డాడు. నన్ను తన భుజాలపై మోశాడు. సుమారు 15 రాత్రులపాటు ఆ సీన్స్‌ని షూట్ చేశాం.