ఒకప్పటితో పోల్చితే ప్రేక్షకుల అభిరుచుల్లో ఇప్పుడు చాలా మార్పులొచ్చాయి. కొత్తదనం నిండిన కథల్ని ఇష్టపడుతున్నారు. అభిమాన తారల్ని కొత్త రకమైన వేషధారణలో చూసుకోవాలని ఆశపడుతున్నారు. అందుకే కొన్నాళ్ల క్రితం వరకు 'ప్రయోగాలు అవసరమా?' అని భావించిన హీరోలు సైతం లుక్కులోనూ.. గెటప్పులోనూ వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడీ క్రమంలోనే పలువురు అగ్ర కథానాయకులు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో మురిపించేందుకు సిద్ధమయ్యారు.
చిరు.. సరికొత్తగా..
మునుపెన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు చిరంజీవి. చేసే ప్రతి చిత్రంలోనూ కొత్త లుక్కుతో కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల్లో 'గాడ్‌ఫాదర్' ఒకటి. మలయాళంలో విజయవంతమైన 'లూసీఫర్' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ ఇటీవలే బయటకొచ్చింది. అందులో చిరు నెరిసిన జుట్టుతో స్టైలిష్‌గా కనిపించి మురిపించారు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. దసరా పండక్కి ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలయ్య ధమాకా..
కథ నచ్చిందంటే చాలు.. చేసే పాత్ర కోసం ఎలాంటి లుక్కులోకి మారడానికైనా వెనకాడరు కథానాయకుడు బాలకృష్ణ. ఇటీవల 'అఖండ' సినిమాలో అఘోరాగా సరికొత్త అవతారంలో మెప్పించారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమా కోసం మరో కొత్త లుక్కు ప్రయత్నించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న మాస్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఓ పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాలు బయటకొచ్చాయి. అందులో బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో ఫుల్ మాస్‌గా కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. దీని తర్వాత బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. అందులో బాలయ్య ఐదు పదుల వయసున్న తండ్రిగా.. సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు తెలిసింది.