ALi Tho Saradaga Vishwak Sen: 'వెళ్లిపోమాకే' అంటూ చిత్రసీమలో కథానాయకుడిగా అడుగుపెట్టి 'ఈ నగరానికి ఏమైంది?' అంటూ ఆకట్టుకుని సందడి చేసిన యువ హీరో విశ్వక్సేన్. 'ఫలక్‌నుమా దాస్'తో మాస్ ఆడియన్స్‌కు దగ్గరై హైదరాబాద్ పొగరును చూపించారు. యాక్షన్ థ్రిల్లర్ 'హిట్: ది ఫస్ట్ కేస్'లో విక్రమ్ రుద్రరాజుగా మెప్పించారు. ఇటీవలే అతడు నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా వరుస చిత్రాలతో అలరిస్తున్న విశ్వక్.. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి ఇటీవల అతిథిగా విచ్చేశారు. ఒక సినిమా విషయంలో ఓ అమ్మాయి మీడియా పేరు చెప్పి బెదిరించిందని, ఆ బాధ భయంగా మారిన సందర్భాన్ని విశ్వక్ సేన్ గుర్తు చేసుకున్నారు.
"ఓ సారి రామానాయుడు స్టూడియోలో ఏదో పని ఉండి అక్కడికి వెళ్లా. అక్కడ నాకొక స్నేహితుడు ఉన్నాడు. 'తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న సినిమాలో మెయిన్ లీడ్ ఇంకా ఓకే కాలేదు. వెళ్లి ఆడిషన్ ఇవ్వచ్చుకదా' అన్నాడు. అప్పటికే నేను మూడు నెలల నుంచి ఆడిషన్స్‌కు వెళ్లలేదు.హీరో రోల్స్‌కి ఫిక్స్ అయి ఉంటారులే అనుకున్నా. కొత్తవాడిని తీసుకొచ్చి మనల్ని మెయిన్ లీడ్‌లో పెట్టి సినిమా ఎవరు తీస్తారనుకున్నా. అతను నా ఫోటోను తీసి వెంటనే తరుణ్ భాస్కర్‌కు పంపిస్తే 'అరె.. ఈ అబ్బాయి కోసం నేను రెండు నెలల నుంచి వెతుకుతున్నా.. పిలువు' అన్నాడు. 'ఫలక్‌నుమాదాస్ సినిమా తీస్తున్నావంట కదా' అన్నారు. 'అవును నేనే నిర్మాతని. మీరు సినిమా ఛాన్స్ ఇస్తే నా సినిమా ఆపేస్తా' అని అన్నాను. వెంటనే తరుణ్ పది నిమిషాల్లో కథ చెప్పేసి, చేతిలో స్టోరీ పెట్టారు. తర్వాత కథ మొత్తం చదివా. ఆ సినిమానే 'ఈ నగరానికి ఏమైంది'.
అయితే కొన్ని రోజులకే ఫోన్ వచ్చింది. 'సారీ మీరు సెలక్ట్ కాలేదు. కారణాలు ఏంటి అనేది అడగొద్దని' అని చెప్పారు. మళ్లీ బాధపడ్డా. కానీ, మూడో రోజూ నాకు.. ఎవరో అమ్మాయి నా గురించి మెయిల్ పెట్టింది. 'వీడు నా సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు మత్తు మందు ఇచ్చి, నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నాలాంటి పరిస్థితి ఏ హీరోయిన్‌కీ రావద్దు. వీడిని మీ సినిమాలో పెట్టుకుంటే మీ ఇష్టం. నేను చెప్పిన తర్వాత మీరు వాడిని సినిమాలో పెట్టుకుంటే మీడియా ముందుకెళ్లి ఏం చేయాలో నాకు తెలుసు' దాని సారాంశం. ఆ బాధ కాస్త నాకు భయంగా మారింది."
- విశ్వక్ సేన్, నటుడు