మెగా మామాఅల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న తమిళ్ రీమేక్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ మూవీలోని భగవంతుడిగా తన వంతు పాత్రను పవన్ పూర్తి చేశారు. ఇక భక్తుడు సాయిధరమ్ తేజ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్‌గా ఉంది!
స్టార్ డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వంలో తమిళంలో విజయవంతమైన వినోదయ సీతమ్‌కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. భక్తుడి పాత్రను సాయిధరమ్ తేజ్ చేస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ క్యారెక్టర్‌కు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయినట్లు దర్శకుడు సముద్రఖని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
'థాంక్యూ గాడ్' అంటూ షూటింగ్ లొకేషన్‌లో పవన్ కల్యాణ్‌కు సన్నివేశాన్ని వివరిస్తున్న ఓ ఫొటోను సముద్ర ఖని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. జులై 28న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మరోసారి చెప్పారు. పవన్ కల్యాణ్‌పై మరో సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
కేవలం 20 రోజులే..
ఈ రీమేక్ సినిమా కోసం పవన్ కల్యాణ్ కేవలం ఇరవై రోజులు మాత్రమే డేట్స్ కేటాయించినట్లు చెబుతున్నారు. ఈ భగవంతుడి పాత్ర కోసం పవన్ కల్యాణ్ రోజుకు రూ.2 కోట్లు చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. మామాఅల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.
ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇంకా మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్, బ్రహ్మానందం, రోహిణి, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ తెలుగు వెర్షన్ కోసం మాటలు అందిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
కాగా, పవన్ కల్యాణ్ వినోదయం సీతంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలోనే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. 17వ శతాబ్దం నాటి చారిత్రక కథతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ దసరాకు విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు పవన్.. హరీశ్ శంకర్ డైరెక్షన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. సాహో ఫేం దర్శకుడు సుజిత్‌తో 'OG' అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేయనున్నారు.