Prashanth Neel Birthday : 'కేజీఎఫ్' సిరీస్ చిత్రాలతో ఇండియావైడ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. దీంతో ఈ డైరక్టర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు ఈయన. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి 'సలార్' చిత్రం చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు.
అయితే జూన్ 4న ప్రశాంత్ నీల్.. తన 43వ ఏట అడుగు పెట్టారు. ఈ సందర్భంగా సినిమా సెట్స్‌లో ఆయన పుట్టినరోజు వేడుకలను డార్లింగ్ ప్రభాస్‌తో పాటు ఆయన చిత్రబృందం గ్రాండ్‌గా నిర్వహించింది. కేక్ కట్ చేసిన తర్వాత హీరో ప్రభాస్, ప్రశాంత్ ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. అనంతరం మొత్తం మూవీ టీమ్ కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో 'హోంబాలే ఫిల్మ్స్' విజయ్ కిర్గందూర్ కూడా ఉన్నారు. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ 'డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్' కూడా ప్రశాంత్‌కు శుభాకాంక్షలు తెలిపింది. అభిమానులు కూడా సోషల్‌మీడియా వేదికగా ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఇకపోతే 'సలార్' సినిమాకి సంబంధించిన టీజర్‌ను మూవీ టీమ్ త్వరలోనే విడుదల చేయనున్నట్టు సమాచారం.