కార్తికేయ 2తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా మంచి విజయం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.121 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగుతో పాటు హిందీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఉత్తరాది ప్రేకక్షులు బ్రహ్మరథం పట్టారు. ఉత్తరాది, దక్షిణాదిలో అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది కార్తికేయ మూవీ. ఈ చిత్రం టీవీ ప్రీమియర్, ఓటీటీ స్ట్రీమింగ్‌లో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్.. ప్రశంసలు, వసూళ్లు మాత్రమే కాకుండా అవార్డుల విభాగంలోనూ తన సత్తాను నిరూపించుకున్నారు. కార్తికేయ చిత్రానికి గాను ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. తాజాగా ఈ అవార్డును నిఖిల్ అందుకున్నారు. అనంతరం ఆ వేడుకలో ప్రసంగించారు. అందుకు సంబంధించిన వీడియోను నిఖిల్.. సోషల్ మీడియాలో పంచుకున్నారు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో 'హే కేశవ.. హే మాధవ.. హే గోవిందా' పాటను జోడించి పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియో చూసిన ఫ్యాన్స్.. నిఖిల్‌కు అభినందనులు చెబుతున్నారు.
అయితే సినిమాకు మరో సీక్వెల్ ఉంటుందని కార్తికేయ.. కొద్ది రోజుల క్రితం చెప్పారు. కార్తికేయ సిరీస్‌లో మూడో భాగం ఉంటుందా? అని ప్రశ్నించగా, 'కచ్చితంగా ఉంటుంది. సాహసాలను, సమస్యలను , మిస్టరీలను ఛేదించే ఉత్సాహం ఉన్న డాక్టర్ కార్తీక్ పాత్ర కొనసాగుతూనే ఉంటుంది. మన దేశ సంస్కృతిలో ఎవరికీ తెలియని ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని భాగాలతో మీ ముందుకు వస్తాం' అని నిఖిల్ చెప్పుకొచ్చారు.
కాగా, కార్తికేయ - 2 చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించాయి. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో చందు మొండేటి కృష్ణ తత్వాన్ని, మహిమను చెప్పడంతో పాటు, పురాణ ఇతిహాసాల్లో చెప్పిన ప్రతి అంశం శాస్త్రీయమైనదే నని బలంగా చెప్పారు. మనం ఎలా బతకాలో శ్రీకృష్ణుడు చెప్పిన విధానాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ స్పైతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో సహా 5 భాషల్లో రూపొందుతోంది.