బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. కానీ, వ్యక్తిగతంగా నవాజుద్దీన్ జీవితం మొత్తం వివాదాలే అని చెప్పాలి. ఇక గత కొన్ని రోజులుగా భార్య ఆలియా అతడిపై ఎన్నో ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే నవాజుద్దీన్ తన భార్యాపిల్లలను ఇంట్లో నుంచి గెంటేయడం సెన్సేషన్‌గా మారింది. ముంబయిలోని ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్న నవాజుద్దీన్.. గతరాత్రి తన భార్య ఆలియా.. పిల్లలు యాని, షోరాను ఇంటి నుంచి గెంటేశారు. నడిరోడ్డుపై నిలబడిన వారు ఒక వీడియో ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు చెప్పుకొచ్చారు.
ఈ అర్ధరాత్రి నవాజ్ మమ్మల్ని ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. నా ఇద్దరు పిల్లలతో నేను రోడ్డున పడ్డాను. నా కుమార్తె వాళ్ల నాన్న ఇంటివైపు చూస్తూ ఏడుస్తోంది. నా దగ్గర రూ.81 ఉన్నాయి. ఇద్దరు పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. నవాజ్ ఇలా చేస్తావని అనుకోలేదు. నిన్ను వదలను.. నన్ను, నా బిడ్డలను రోడ్డు మీద పడేశావ్.. కచ్చితంగా నేను నిన్ను వదలను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
నవాజుద్దీన్.. మొదటి భార్య నుంచి విడిపోయాక అలియాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక తన భర్త పెళ్లి అయిన దగ్గర నుంచి తనను వేధిస్తున్నాడని, తనను బలవంతంగా అనుభవిస్తున్నాడని ఆమె ఇటీవలే మీడియా ముందు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అతడి నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని చెప్పుకొచ్చింది. దీంతో గత కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య వివాదం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.