Hero Nani Success Formula : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'హాయ్ నాన్న' సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. డిసెంబర్ 7న రిలీజైన ఈ సినిమా మంచి టాక్ దక్కించుకొని, మినిమమ్ ఆక్యుపెన్సీతో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ ఏడాది 'దసరా'తో హిట్ కొట్టిన నాని, తాజాగా 'హాయ్ నాన్న' సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్నారు. దీంతో ఒకే సంవత్సరంలో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు నాని. అయితే నాని సినిమా డిసప్పాయింట్ చేయదనే ఆలోచనతో, ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నాని సక్సెస్ మంత్ర ఏమిటా అని నెట్టింట్లో చర్చలు నడుస్తున్నాయి.
అయితే వరుస సినిమాలు చేస్తూనే, ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న కథలు ఎంపిక చేసుకుంటారు నాని. ఇదివరకు ఆయన నటించిన 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్', 'అంటే సుందరానికి', 'శ్యామ్ సింగ రాయ్', 'దసరా' సినిమాలు అలాంటివే. పైగా కొత్త డైరెక్టర్లకు నాని ఎక్కువగా ఛాన్స్ ఇస్తుంటారు. అయితే కొంతమంది కొత్తవాళ్లతో రిస్క్ ఎక్కువ అనుకుంటారు. కానీ, నాని అలాకాకుండా కొత్తవారితోనే హిట్లు అందుకున్నారు. ఒక రకంగా నాని విజయ రహస్యం ఇదే కావచ్చని నెటిజన్లు అనుకుంటున్నారు.