రచన పట్ల ఆసక్తి ఉన్న తనను దర్శకత్వం వైపు మళ్లించింది నానినే అని ఆమె సోదరి దీప్తి తెలిపారు. తనకు ఎదురైన అనుభవాలతో ఐదు కథల సమాహారంగా మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు హీరో నాని సోదరి దీప్తి. నాని సమర్పణలో సోని లీవ్ నిర్మించిన ఈ సిరీస్.. ఈ నెల 25న స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆ వెబ్ సిరీస్ విశేషాలతోపాటు దర్శకురాలిగా తన తొలి అనుభవాన్ని దీప్తి పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..
"ఓ మంచి కాఫీ లాంటి సినిమా. చూస్తే చాలా హాయిగా ఉంటుంది. అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు వాళ్ల మధ్య వచ్చే అందమైన పరిస్థితులు సంఘటనలు.. సంభాషణలు.. ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతే ఎలా ఉంటుదనేది ఇందులో ఉంటుంది. మన రోజువారి జరిగిన సంఘటనల్లో జరిగే వాటిని తీసుకునే దీన్ని తీశాం. నానికి ఇది చాలా నచ్చింది. డైరెక్షన్ చేయమని తనే బాగా ప్రోత్సహించాడు. అయితే స్పెషల్ సజెషన్స్ ఏమీ ఇవ్వలేదు. 36 రోజుల పాటు షూట్ చేశాం. మొదట ఎలా చేస్తానో లేదో అని చాలా సందేహపడ్డాను. కానీ సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత చేసేశాను. బెస్ట్ ఔట్పుట్ వచ్చింది. నటీనటులు బాగా సహకరించారు. ఇది నా ఫ్యాషన్ ప్రాజెక్ట్. ప్రతిఒక్కరు దీనికి కనెక్ట్ అవుతారు. మళ్లీ మరో మంచి కథ రాసినప్పుడు రెండో సినిమా తీస్తా. నా భర్తే నా ఫ్రూఫ్ రీడర్. నా అన్నీ కథలు చదువుతారు. ఆయన కూడా బాగా ప్రోత్సాహించారు. నా పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకున్నారు. ప్రేక్షకులందరూ ఈ వెబ్‌సిరీస్‌ను బాగా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా" అని దీప్తి పేర్కొన్నారు.