Rocketry Madhavan ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్'. హీరో మాధవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఆయనే ప్రధాన పాత్రలో కూడా నటించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను అందుకుంది. అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోయి చిత్రయూనిట్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. సామాన్య ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరూ ఈ చిత్రంపై, ఇందులో నటించిన మాధవన్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే మాధవన్ రాకెట్రీ సినిమా బడ్జెట్ కోసం నిధులు సేకరించే క్రమంలో తన ఇంటినే అమ్మేశాడంటూ ఓ వార్త వైరల్ అయింది.
తాజాగా ఈ విషయమై ట్విటర్ ద్వారా మాధవన్ స్పందించారు. ఈ మూవీ కోసం ఇల్లు అమ్ముకోవడం కాదు కదా.. నిజానికి మంచి లాభాలు తెచ్చిపెట్టిందని చెప్పారు. "ఓ యార్. దయచేసి నా త్యాగాన్ని మరీ ఎక్కువ చేసి చూపించకండి. నా ఇల్లే కాదు ఏమీ కోల్పోలేదు. నిజానికి ఈ రాకెట్రీ మూవీ కోసం పని చేసిన అందరూ చాలా గర్వంగా ఎక్కువ ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టారు. దేవుడి దయ వల్ల మేమందరం మంచి లాభాలు అందుకున్నాం. నేను ఇప్పటికీ నా ఇంట్లోనే ఉంటున్నాను" అని మాధవన్ ట్వీట్ చేశాడు.