వైవిధ్యభరితమైన కథలతో అలరిస్తూ.. తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు కథానాయకుడు కార్తి. ఇటీవలే 'పొన్నియిన్ సెల్వన్'తో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. ఇప్పుడు 'సర్దార్'గా అలరించేందుకు సిద్ధమయ్యారు. 'అభిమన్యుడు' ఫేమ్ పి.ఎస్.మిత్రన్ తెరకెక్కించిన చిత్రమిది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ విడుదల చేస్తోంది. ఇది శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించారు కార్తి. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలివి..
తాజాగా 'పొన్నియిన్ సెల్వన్'తో హిట్ అందుకున్నారు. నెల వ్యవధిలోనే 'సర్దార్'తో వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది?
"చాలా హ్యాపీ. నిజానికి 'పొన్నియిన్ సెల్వన్' వేసవికి రావల్సింది. కొంచెం ఆలస్యమైనా గొప్ప విజయాన్ని అందుకుంది. ఇలాంటి హిట్ తర్వాత ఓ సినిమా తీసుకురావాలంటే కచ్చితంగా కొత్తగా.. స్పెషల్‌గా ఉండాలి. అలా ఇండియన్ స్పై థ్రిల్లర్‌గా 'సర్దార్' వస్తోంది. తొలిసారి తండ్రీ కొడుకుల పాత్రల్లో కనిపించనున్నా. కథ ప్రకారం దీంట్లో చాలా గెటప్స్ ఉన్నాయి. నేనిప్పటి వరకు నేర్చుకున్న దానికి ఇదొక పరీక్షలా ఉంది (నవ్వుతూ)".
ఈ చిత్ర కథేంటి? మీ పాత్రలు ఎలా ఉండనున్నాయి?
"దర్శకుడు మిత్రన్ 'అభిమన్యుడు'లో డిజిటల్ క్రైమ్ వరల్డ్‌ని చూపించారు. అది చాలా కొత్తగా.. షాకింగ్‌గా అనిపించింది కదా. 'సర్దార్'లోనూ అలాంటి ఆసక్తికర అంశాలు చాలా ఉన్నాయి. ట్రైలర్‌లో ఒక ఫైల్ మిస్ అయినట్లు చూపించాం. అందులో మనం బతకడానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. ఈ కథ వినకముందు దాని గురించి నాకు పెద్ద ఆలోచనే లేదు. విన్నాక మాత్రం భయమనిపించింది.
ఈ సినిమా చూసిన తర్వాత ప్రతిఒక్కరూ కొన్ని మామూలు అలవాట్లు కూడా మార్చుకుంటారనే నమ్మకం ఉంది. ఒక గ్రామంలో పుట్టి పెరిగిన రంగస్థల నటుడు గూఢచారిగా మారి ఏం చేశాడన్నదే చిత్ర కథాంశం. దీన్ని మిత్రన్ తెరపై అద్భుతంగా చూపించాడు. దీంట్లో నేను పోషించిన రెండు పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయి. సమాజం నుంచి ఏమీ ఆశించని పాత్రగా సర్దార్ కనిపిస్తే.. ప్రతి చిన్నదానికీ ప్రచారం కోరుకునే పోలీస్‌గా మరో పాత్ర కనిపిస్తుంది"
'సర్దార్'గా వయసు పైబడ్డ పాత్ర పోషించడానికి ఎలా సిద్ధమయ్యారు?
"60ఏళ్లకు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయని మా నాన్నని అడిగా. అయితే ఆయనకు యోగా అలవాటు ఉంది. దాని వల్ల తన శరీరంలో ఎలాంటి మార్పులు రాలేదు. నాజర్‌ని అడిగితే.. మోకాళ్ల నొప్పుల వల్ల మెట్లు ఎక్కడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందన్నారు. అలాగే మాట్లాడినప్పుడు నోటి నుంచి ఎక్కువ గాలి వస్తుందని చెప్పారు. అయితే గెటప్ వేసుకుంటే వయసు పైబడ్డ వ్యక్తిలా కనిపించొచ్చు కానీ, ఈ సర్దార్ యాక్షన్ కూడా చేయాలి. అలాగే దీనికి పోలీస్ పాత్రకు మధ్య వ్యత్యాసం చూపించాలి. అందుకే ఈ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.
నా కెరీర్‌లో అత్యంత సవాల్‌తో కూడిన పాత్ర 'సర్దార్'. దీన్ని ఓ రియల్ పాత్ర స్ఫూర్తితో డిజైన్ చేశారు. ఆ పాత్ర సంకేత నామం టైగర్. భారత్‌లో పుట్టిన ఆయన.. పాకిస్థాన్ ఆర్మీలో జనరల్ స్థాయికి ఎదిగారు. ఈ చిత్ర కథకు ఆయనే స్ఫూర్తి. 'ఖైదీ' చేసేటప్పుడు ఒక హాలీవుడ్ సినిమాకి దీటుగా ఉండాలని తీశాం. ఇప్పుడీ చిత్రాన్ని కూడా అలా ఓ హాలీవుడ్ మూవీలాగే తెరకెక్కించాం".