సినిమాకి తొలి ఆకర్షణ.. కలయికే. ఫలానా హీరో, ఫలానా దర్శకుడితో కలిసి చేస్తున్న సినిమా అంటూ కలయికలతో ముడిపెట్టే వాటి ప్రస్తావనని తీసుకొస్తుంటారు. ఇందులో విజయవంతమైన కలయికలు ఉంటాయి, తొలి కలయికలు ఉంటాయి. కొన్నిసార్లేమో పరాజయాల్ని చవిచూసినా సరే... మరో ప్రయత్నంలో భాగంగా ఒక్కటైన కలయికలూ ఉంటాయి. 'హిట్ కాంబినేషన్' అనే మాటకి తెలుగులో బలమైన మార్కెట్ కూడా ఉంది. అయితే చిత్రసీమలో ఎప్పుడు ఏ కలయికలో సినిమా కుదురుతుందో ఊహించలేం. కథలే ఆయా కలయికల ప్రయాణాన్ని నిర్దేశిస్తుంటాయనేది సినీ పండితులు చెప్పే మాట. తెలుగులో ఇప్పటికే మరో దఫా హిట్ కాంబినేషన్లు సెట్ అయిపోయాయి. వాటికి భిన్నంగా తొలిసారి జట్టు కట్టి ఆకర్షిస్తున్న కలయికలూ చాలానే ఉన్నాయి. ఆ సంగతులేమిటో ఓసారి చూద్దాం.
మహేష్‌బాబు - త్రివిక్రమ్.. పవన్‌కల్యాణ్ - హరీష్‌శంకర్.. ఎన్టీఆర్ - కొరటాల శివ..ఇలా ఇదివరకే కలిసి పనిచేసిన ఈ కలయికలు మరోసారి జట్టు కట్టి ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి. ఈ కలయికల్లో రూపొందుతున్న సినిమాలపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. గత సినిమాల్ని, విజయాల్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి అందుకు దీటైన అంచనాలతో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. వ్యాపార వర్గాలు సైతం ప్రత్యేకమైన ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. కొన్నిసార్లు కొన్ని కొత్త కలయికలు కూడా ఇదే స్థాయిలో ఆకర్షిస్తూ, అంచనాల్ని రేకెత్తిస్తుంటాయి. తొలిసారే కలిశారు కదా, ఎలాంటి సినిమాని సిద్ధం చేసి తీసుకొస్తారో అనే ఉత్సుకతే అందుకు కారణం.
యువ దర్శకుల్లో అనిల్ రావిపూడి శైలే వేరు. హీరోయిజాన్ని, వినోదాన్ని మేళవించి అటు స్టార్ల అభిమానుల్ని, ఇటు సగటు ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఆయన దిట్ట. అలాంటి దర్శకుడు... మాస్‌లో క్రేజ్ ఉన్న బాలకృష్ణతో జట్టు కడుతున్నాడంటే అది కచ్చితంగా ప్రత్యేకమే. ఈమధ్య సెట్స్‌పైకి వెళ్లిన కలయికల్లో ప్రధానంగా ఆకర్షిస్తున్నది బాలకృష్ణ - అనిల్ కాంబోనే. 'గబ్బర్‌సింగ్' తర్వాత పవన్‌కల్యాణ్ - హరీష్‌శంకర్ కలిసి 'ఉస్తాద్ భగత్‌సింగ్' చేయనున్నప్పటికీ, ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' చేస్తున్న పవన్‌కల్యాణ్ -క్రిష్ తొలిసారే జట్టు కట్టారు. ఈమధ్యే పక్కా అయిన పవన్‌కల్యాణ్ - సుజీత్ కలయిక కూడా కొత్తదే.
తొలిసారి జట్టుకడుతున్న హిరో - దర్శకులు మరో అగ్ర కథానాయకుడు ప్రభాస్ చేస్తున్న 'ఆదిపురుష్' మొదలుకొని సినిమాలన్నీ కొత్త కలయికల్లో రూపొందుతున్నవే. 'ప్రాజెక్ట్ కె' కోసం యువ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో జట్టు కట్టారు. 'సాలార్' కోసం ప్రశాంత్ నీల్, 'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి వంగా, అలాగే ప్రభాస్ - మారుతి కలయికలోనూ మరో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'రంగస్థలం' తర్వాత రామ్‌చరణ్ - సుకుమార్ కలయికలో మరో సినిమాకి రంగం సిద్ధమైనప్పటికీ, ఆలోపే అగ్ర దర్శకుడు శంకర్, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్ సినిమాలు చేయనున్నారు. వీళ్లవి తాజా కలయికలే.
యువ దర్శకులతో..
యువ కథానాయకులే కాదు.. సీనియర్ కథానాయకులు కూడా యువ దర్శకులతో కలిసి పనిచేయడానికే మొగ్గు చూపుతున్నారు. దాంతో ఎక్కువగా కొత్త కలయికలే కుదురుతున్నాయి. బాలకృష్ణ - గోపీచంద్ మలినేని, చిరంజీవి - బాబీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఈ సంక్రాంతికి ఘన విజయాల్ని సొంతం చేసుకున్నాయి. దాంతో అగ్ర తారలకి యువ దర్శకులపై మరింత నమ్మకం పెరిగినట్టైంది. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళాశంకర్' చేస్తున్నారు. వీళ్లు కలిసి పనిచేయడం ఇదే తొలిసారి.
మరో అగ్ర కథానాయకుడు వెంకటేష్ కూడా ఈసారి యువ దర్శకుడైన శైలేష్ కొలనుతో జట్టు కట్టడానికి సిద్ధమయ్యారు. నాగార్జున చేయనున్న తదుపరి సినిమాతో రచయిత ప్రసన్నకుమార్ బెజవాడని దర్శకుడిగా పరిచయం కానున్నట్టు తెలుస్తోంది. రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాలు కూడా ఫ్రెష్ కాంబినేషన్లే. సుధీర్‌వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' రూపొందుతుండగా, 'టైగర్ నాగేశ్వరరావు' వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది.
నవతరం కథానాయకుల సినిమాలు కూడా దాదాపుగా కొత్త కలయికలతో రూపొందుతున్నవే. కల్యాణ్‌రామ్ 'అమిగోస్', 'డెవిల్' చిత్రాలకి రాజేంద్రరెడ్డి, నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. నాని 'దసరా'తోనే శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవలే ప్రకటించిన నాని కొత్త సినిమాని కూడా శౌర్య అనే కొత్త దర్శకుడే తెరకెక్కిస్తారు. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి, వరుణ్‌తేజ్ - ప్రవీణ్ సత్తారు, సాయిధరమ్ తేజ్ - కార్తీక్ దండు.. ఈ కాంబినేషన్లన్నీ కూడా కొత్తవే. సరికొత్త వినోదానికి సంకేతాలు ఇస్తున్న ఈ కలయికలు ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.