Hero Arya On His Upcoming Movie : నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కొద్దిమంది తమిళ నటుల్లో ఆర్య ఒకరు. 'వరుడు'లో ప్రతినాయకుడి పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు 'వాడు వీడు', 'నేనే అంబానీ', 'రాజారాణి' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. గతేడాది విడుదలైన 'సార్‌పట్ట' చిత్రాలతో ఘన విజయం అందుకున్న ఆర్య ఈ ఏడాది 'కెప్టెన్' చిత్రంతో తెలుగు అభిమానుల ముందుకి రానున్నారు. అద్భుతమైన గ్రాఫిక్స్ హంగులతో రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా కెప్టెన్ సినిమా విశేషాలు నటుడు ఆర్య మాటల్లోనే..
అసలు కెప్టెన్ కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది?
ఆర్య: డైరెక్టర్ శక్తి సౌందరరాజన్ నాకు 'టెడ్డీ'తో పరిచయం. గతంలో 'టిక్..టిక్..టిక్..' లాంటి సైన్స్ ఫిక్షన్‌ని కూడా తీశారు. వేరే డైరెక్టర్ ఎవరైనా ఈ స్టోరీ చెప్పుంటే నేను ఆలోచించేవాడినేమో! ఆయనకి ఆ సత్తా ఉందని నమ్మి కెప్టెన్ కి ఒకే చెప్పాను.
ట్రైలర్‌లో కనిపించే జంతువే ఈ సినిమాకి ప్రధానాంశమా? ఇంకేమైనా ఉందా?
ఆర్య: కెప్టెన్‌లో నేను ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించా. మా పోరాటం ప్రపంచానికి సంబంధం లేని కొత్త రకం జంతువులపై. ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, థ్రిల్లింగ్ అంశాలన్నీ ఉంటాయి. ఈ సినిమా కోసం సృష్టించిన జంతువులు మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి.
ప్రతి సినిమాలోలాగే ఈ సినిమాలో ఛాలెంజింగ్‌గా ఏమైనా చేశారా?
ఆర్య: ఈ సినిమా పూర్తిగా సైన్స్‌ఫిక్షన్. ఇందులో ప్రతి సన్నివేశాన్ని సాంకేతిక సిబ్బంది కష్టపడి రూపొందించారు. నటులు సైతం చాలా కష్టపడ్డారు. కెప్టెన్ క్లైమాక్స్‌ను చిత్రీకరించడానికి దాదాపు 100అడుగుల దిగువన, నీటిలో 20 అడుగుల లోతులో ఆక్సిజన్ సిలిండర్లు మోసుకుంటూ, స్కూబా డైవింగ్ కాస్ట్యూమ్‌తో మూడు రోజులు కష్టపడ్డాం.
'కెప్టెన్'కు మీరు సహనిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమా బడ్జెట్ ఏంత?
ఆర్య: అవును.. నేను సహ నిర్మాతను. కానీ, బడ్జెట్ ఎంతయ్యిందనేది మేము చూసుకోలేదు. ప్రతి సన్నివేశాన్ని అనుకున్న విధంగా పూర్తి చేశాం. గ్రాఫిక్స్ హంగులకే బడ్జెట్ ఎక్కువయ్యింది.
ఈ సినిమాలో సిమ్రన్ నటించారు..ఆమె పాత్ర ఎలా ఉంటుంది?
ఆర్య: ఆమె పాత్ర చాలా కీలకం. ఒకవేళ ఆమె ఆ పాత్రకు నో చెప్పుంటే మాకు వేరే ఆప్షన్ లేదు. కానీ ఆమె ఒప్పుకోవడం మాకు ప్లస్ అయ్యింది. సినిమాకు బలమైంది.
ఈ తరహా ప్రయత్నం, కొత్త జోనర్‌లో ప్రయోగం చేయడానికి కారణమేంటి?
ఆర్య: నిజానికి నా దగ్గరికి వచ్చే స్టోరీలు అలానే ఉంటాయి. ఇంకా దర్శకుడు శక్తి సౌందరరాజన్‌కు ఇటువంటి ప్రయోగాలు చేయడం అలవాటు. అందుకే మేమంతా కలిశాం.
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది.. కెప్టెన్‌ను ఎందుకు రెండు భాషల్లోనే(తెలుగు, తమిళం) విడుదల చేస్తున్నారు?
ఆర్య: నిజమే నేనిప్పటివరకూ పాన్ ఇండియా సినిమాలో నటించలేదు. అయితే మొదట రెండు భాషల్లో విడుదల చేసి ప్రేక్షకుల స్పందన బట్టి ఇతర భాషల్లోనూ విడుదల చేసే ఆలోచన ఉంది.