దర్శకధీరుడు రాజమౌళి టేకింగ్‌కు హాలీవుడ్ ప్రేక్షకులు, సినిమా ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురిస్తూ విదేశీ మీడియా సైతం ఆయన దర్శకత్వాన్ని మెచ్చుకుంటోంది. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి ప్రస్తుతం విదేశాల్లో పర్యటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అంతర్జాతీయ వేదికలపై ప్రసంగిస్తున్నారు. విదేశీ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి గురించి లాస్ ఏంజిల్స్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో జక్కన అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ట్విటర్ వేదికగా ఆ పత్రిక ఇమేజ్‌ను పోస్ట్ చేస్తూ శుభాభినందనలు చెబుతున్నారు. అభిమానులే కాదు, సినిమా పరిశ్రమకు చెందిన వారు సైతం అభినందనలు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలుగు దర్శకుడికి దక్కిన గౌరవానికి గర్వపడుతూ సదరు పోస్ట్‌ను షేర్ చేస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ నమస్కారం ఎమోజీలను ఉంచారు. హరీశ్ ట్వీట్‌కు మరో నెటిజన్ స్పందిస్తూ 'సర్.. పవన్‌కల్యాణ్‌తో మరోసారి సినిమా చేసే అవకాశం మీకు లభించింది. గబ్బర్ సింగ్‌లాంటి రొటీన్ మసాలా మూవీని మళ్లీ చేయొద్దు. అంతర్జాతీయ స్థాయిలో అందరూ తమ సినిమా అనుకునేలా మూవీ తీయండి. మంచి సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి. హీరో కొడితే ఎగిరిపడే ఫైట్ సీన్స్ కూడా వద్దు. ప్రతి ఫైట్ సహజంగా ఉండాలి' అని కోరాడు.