పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'హరి హర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పవన్‌కల్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు. నేడు ఎ. ఎం. రత్నం పుట్టినరోజు. ఈ సందర్భంగా మూవీటీమ్ ఆయనకు స్పెషల్ విషెస్ తెలుపుతూ.. సెట్స్‌లో పవన్‌తో కలిసి ఆయన దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో వీరిద్దరూ సరదాగా నవ్వుకుంటూ కనిపించారు.
ఇక ఎ.ఎం.రత్నం విషయానికొస్తే.. మేకప్ మెన్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత నిర్మాతగా మారారు. సూర్యామూవీస్ బ్యానర్‌పై ఆయన నిర్మించిన చిత్రాలు, అనువదించిన సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. బాల్యం నుంచే సినిమాలంటే ఆసక్తి ఉండటంతో మద్రసు చేరుకున్న ఆయన మొదట హీరోయిన్ విజయ శాంతి నటిస్తున్న సినిమాకు మేకప్ మెన్‌గా పనిచేశారు. ఆ తర్వాత విజయశాంతి దగ్గరే పనిచేశారు. ఆమె ప్రోత్సాహంతో ఆయన కూడా ఓ నిర్మాతగా ఎదిగారు! తొలి ప్రయత్నంగా మోహన్ గాంధీ దర్శకత్వంలో రూపొందించిన కర్తవ్యం అనూహ్య విజయం సాధించింది. విజయశాంతిని జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిపింది. అనంతరం స్వీయ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ధర్మయుద్ధం అనే చిత్రాన్ని తీయగా అది కూడా హిట్‌గా నిలిచింది.