Guntur Karam Hanuman Clash:2024 సంక్రాంతి బాక్సాఫీస్ పోటీ రోజు రోజుకు ఆసక్తి రేపుతోంది. ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 5 సినిమాలు పోటీ పడుతుండడం విశేషం. అందులోనూ జనవరి 12న 'గుంటూరు కారం', 'హనుమాన్' ఏకంగా రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే మొదట్లో ఈ పోటీ నుంచి ఎవరైనా ఒకరు తప్పుకుంటారేమో అనుకున్నారంతా. కానీ, ఎవరూ తగ్గేదేలే అనడం వల్ల కొన్ని రోజులుగా వీటి గురించే చర్చ నడుస్తోంది.
అయితే తాజాగా ఓ ట్వీట్ మరింత ఆసక్తిగా మారింది. 2000 సంవత్సరంలో రిలీజైన మహేశ్‌బాబు 'యువరాజు' సినిమాలో, 'హనుమాన్' హీరో తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. యువరాజు సినిమాలో తేజ సజ్జ, మహేశ్‌బాబు కుమారుడి పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు ఏకంగా 2024 సంక్రాంతికి మహేశ్ సినిమాకు పోటీగా వస్తున్నాడంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలైంది. దానికి తేజ స్పందిస్తూ, 'సూపర్‌స్టార్‌తో పోటీ ఏంటి సర్. ఆయనతో పోటీగా కాదు, ఆయనతో పాటుగా' అని ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు.
Hanuman Movie: తేజ సజ్జ లీడ్ రోల్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను 11 భాషల్లో తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్లో చూపించి హై క్వాలిటీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్స్‌కు ఇప్పటికే విశేష స్పందన లభించింది. ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య, వినయ్ రాయ్, దీపక్ శెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.