Guntur Kaaram Sreeleela Banner :స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంటే థియేటర్ల దగ్గర అభిమానుల హంగామా మాములుగా ఉండదు. తమ అభిమాన హీరోల భారీ ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టి పాలాభిషేకాలతో ఈలలు వేస్తూ గోల గోల చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఎక్కువగా హీరోల బ్యానర్లే పెట్టడమే చూస్తుంటాం. హీరోయిన్ల బ్యానర్లు కట్టడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.
తాజాగా యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలకు బ్యానర్లు కట్టేశారు అభిమానులు. గుంటూరు కారం విడుదల సందర్భంగా శ్రీలీల కోసం ఓ అభిమాని కట్టిన బ్యానర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే దానిపై అదిరిపోయే కొటేషన్లు కూడా రాశారు. గుంటూరు కారం ఘాటు - మూవీకి హీరోయిన్ శ్రీలీల స్వీటు - అందుకే నువ్వే నా హార్టు అంటూ స్పెషల్ కొటేషన్లు రాశారు. దాని కింద శ్రీలీల డైహార్ట్ ఫ్యాన్స్ అంటూ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ బ్యానర్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఇకపోతే గతంలో అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ ప్రధాన చిత్రాలతో అలరించిన అనుష్కకు, ఆ తర్వాత నయనతార, సమంతకు మాత్రమే బ్యానర్లు కట్టారు. కానీ ఇప్పుడు వీళ్లకు దీటుగా శ్రీలీలకు కూడా బ్యానర్లు కట్టి ఆరాధించేస్తున్నారు. కన్నడ నుంచి ఓ తెలుగమ్మాయికి ఇంత పెద్ద స్థాయిలో గౌరవం దక్కడం విశేషం. శ్రీలీల కన్నా ముందే చాలా మంది తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా మారినా ఇంకా స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్నారు. కానీ కెరీర్ ప్రారంభంలోనే శ్రీలీల ఇంత పెద్ద స్టార్ డమ్ రావడం విశేషమనే చెప్పాలి.