Guntur Kaaram Pre Release Event : 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూపర్ స్టార్ నటుడు మహేశ్‌బాబు భావోద్వేగానికి గురయ్యారు. ఇకపై అభిమానులే తనకు అమ్మ, నాన్న అని అన్నారు. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్‌బాబు- మాటల మాంత్రికుకడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమిది. యంగ్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. ప్రముఖ జగపతిబాబు, సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జవనరి 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గుంటూరు నగరంలో అభిమానుల సమక్షంలో వేడుక నిర్వహించారు.
'ఇకపై మీరే నాకు అమ్మానాన్న'- 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ వేదికపై మహేశ్ ఎమోషనల్ - గుంటూరు కారం హీరోయిన్లు
Guntur Kaaram Pre Release Event : సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన తాజా చిత్రం 'గుంటూరు కారం. మంగళవారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇకపై మీరో నాకు అమ్మా, నాన్న అంటూ మహేశ్ భావోద్వేగానికి గురయ్యారు.
Published : Jan 9, 2024, 10:28 PM IST
|Updated : Jan 9, 2024, 10:56 PM IST
'గుంటూరులో ఈ ప్రీ రిలీజ్ వేడుక జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో మీరు (అభిమానులు) త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. 'ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ నిర్వహించాలా?' అని మేమంతా చర్చించుకుంటుంటే 'మీ ఊరిలో చేద్దాం' అని అన్నారు. త్రివిక్రమ్ నాకు స్నేహితుడికంటే ఎక్కువ. కుటుంబ సభ్యుడిలాంటివారు. గత రెండు సంవత్సరాలుగా ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. 'అతడు'తో మా ఇద్దరి ప్రయాణం మొదలైంది. 'ఖలేజా'తో మ్యాజిక్ జరిగింది. అలాంటి మ్యాజిక్ 'గుంటూరు కారం'లోనూ కనిపిస్తుంది. ఈ సినిమాలో మీరు కొత్త మహేశ్‌బాబును చూడబోతున్నారు. తెలుగమ్మాయి శ్రీలీల స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుండడం సంతోషంగా ఉంది. ఆమెతో కలిసి డ్యాన్స్ చేయడం చాలా కష్టం. మేం అడగ గానే ఏం ఆలోచించకుండా ఓ కీలక పాత్రలో నటించేందుకు మీనాక్షి చౌదరి అంగీకరించింది. ఆమెకు కూడా థ్యాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నా సోదరుడిలాంటివాడు. నేను, త్రివిక్రమ్ ఇచ్చిన సూచన మేరకు 'కుర్చీ మడత పెట్టి' పాటను కంపోజ్ చేశాడు. సినిమాలో ఆ పాట వచ్చినప్పుడు థియేటర్లు బద్దలైపోతాయి'' అని మహేశ్ బాబు గుంటూరు కారంపై ఆసక్తి పెంచారు.
ఆ తర్వాత అభిమానులనుద్దేశించి మాట్లాడారు మహేస్ బాబు. 'మీరు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు, నాన్నగారికి బాగా కలిసొచ్చిన పండగ. ఆ సీజన్‌లో మా చిత్రం విడుదలైతే అది బ్లాక్‌బస్టరే. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుంది. కానీ, ఇప్పుడు నాన్న లేరు. ఆయన నా మూవీలు చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే ఆనంద పడేవాడిని. ఫోన్ కాల్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాడిని. ఆ సంగతులన్నీ ఇక నుంచి మీరే చెప్పాలి. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న'' అంటూ ఎమోషనల్ అయ్యారు.