తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

60 వసంతాల 'గుండమ్మ కథ'.. ఆసక్తికర విషయాలు మీకోసం.. - గుండమ్మ కథకు 60 ఏళ్లు

ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు? అన్న దగ్గర మొదలై.. ఈ సినిమా చూడని వారు ఉన్నారా? అన్నంత వరకూ వెళ్లిన అలనాటి చిత్రం గుండమ్మ కథ. 1962 జూన్‌ 7న విడుదలైన ఈ చిత్రం మంగళవారం(జూన్‌7)తో 60 వసంతాలను పూర్తి చేసుకుంటోంది. అలాంటి కల్ట్‌ క్లాసిక్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

Gundamma Katha
గుండమ్మ కథ

By

Published : Jun 6, 2022, 8:29 PM IST

Gundamma Katha: ఏ చిత్ర పరిశ్రమలోనైనా కొన్ని క్లాసిక్‌ మూవీలు ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు, ఎన్నితరాలు చూసినా ఎప్పుడూ కొత్త ఆవకాయలా ఘాటుగా, నవనవలాడే బంగినపల్లి మామిడిలా ఉంటాయి. అలాంటి చిత్రాల్లో 'గుండమ్మకథ' ఒకటి. 1962 జూన్‌ 7న విడుదలైన ఈ చిత్రం మంగళవారం(జూన్‌7)తో 60 వసంతాలను పూర్తి చేసుకుంటోంది. ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు? అన్న దగ్గర మొదలై.. ఈ సినిమా చూడని వారు ఉన్నారా? అన్నంత వరకూ వెళ్లింది. అలాంటి కల్ట్‌ క్లాసిక్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

గుండమ్మ కథలోని ఓ సన్నివేశం
  1. 'గుండమ్మ కథ' ఓ కన్నడ మూవీ రీమేక్‌. జానపద బ్రహ్మ విఠలాచార్య 1958లో 'మనె తుంబిద హెణ్ణు' అనే సినిమా తీశారు. ఆ కథ నాగిరెడ్డికి చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత నరసరాజు సహకారంతో తెలుగునేటివికీ తగ్గట్టు మార్పులు చేశారు.
  2. నాగిరెడ్డి సినిమాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా, అంతిమంగా చక్రపాణి ఆమోద ముద్రవేయాలి. కన్నడ సినిమాలో ఉన్న కొన్ని విషయాలు నచ్చని చక్రపాణి షేక్‌స్పియర్‌ రచన 'టేమింగ్‌ ఆఫ్‌ ది ష్రూ' నుంచి కొంత స్ఫూర్తి పొంది అచ్చ తెలుగు కథను సిద్ధం చేశారు.
  3. 'గుండమ్మ కథ'కు ఆధారమైన 'మనె తుంబిద హెణ్ణు'లో ఓ పాత్ర పేరు గుండమ్మ. కథను మార్చుకోవడంలో గుండమ్మను ప్రధాన పాత్రగా చేసుకున్నారు. అసలు ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తుండగా, అదే పేరు ఉంచేయమని చక్రపాణి సలహా ఇచ్చారు. చివరకు దాన్నే ఖాయం చేశారు. ఆ సినిమాలో అగ్ర హీరోలున్నా, ఒక క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పేరుపై సినిమా టైటిల్‌ పెట్టడం విశేషం.
  4. ఇక దర్శకుడిగా తొలుత బి.ఎన్‌.రెడ్డి పేరును అనుకున్నారు. ఒక రిమేక్‌ను అంత పెద్ద దర్శకుడితో తీయిస్తే బాగుండదని పుల్లయ్యను ఎంచుకుంటే ఎలా ఉంటుందా? అని చర్చించారు. నరసరాజు రాసిన డైలాగ్‌ వెర్షన్‌ ఆయనకు పంపితే 'ఈ ట్రీట్‌మెంట్‌ నాకంత నచ్చలేదు' అన్నారట. దీంతో నాగిరెడ్డి రంగంలోకి దిగి కమలాకర కామేశ్వరరావుకు దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, కామేశ్వరరావు అప్పటివరకూ పౌరాణిక చిత్రాలే తీశారు. ఈ సినిమా ద్వారా తొలిసారి ఓ సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించారు.
  5. ఈ సినిమా కోసం అప్పటి అగ్ర స్టార్స్‌ అయిన ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, సావిత్రి, జమున, ఎస్వీఆర్‌, రమణారెడ్డి వంటి వారిని ఎంపిక చేశారు. అయితే, అందరూ డేట్స్‌ ఇచ్చినా, సినిమా మాత్రం మొదలు పెట్టలేదు. అందుకు కారణం 'గుండమ్మ' పాత్ర ఎవరు చేయాలి? ఒక షూటింగ్‌లో సూర్యకాంతం మాట తీరు గమనించిన నాగిరెడ్డి 'గుండమ్మ' పాత్రకు ఆమె అయితేనే కరెక్ట్‌గా ఉంటుందని భావించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌ వద్ద ప్రస్తావిస్తే ఆయన కూడా మరో మాట చెప్పకుండా ఓకే అనేశారు.
  6. 'గుండమ్మకథ'లోని అన్ని పాటలను పింగళ నాగేంద్రరావు రాశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం అందించారు. ఇందులోని ప్రతీ పాట ఒక క్లాసిక్‌. ఇందులోని పాటల చిత్రీకరణ చాలా విచిత్రంగా జరిగింది. 'కోలో కోలోయమ్మ కోలో నా స్వామి'పాటలో రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున నలుగురూ నటించారు. పాట షూట్‌ చేసే సమయంలో హీరోలిద్దరికీ ఒకేసారి సమయం కుదరకపోవడంతో రామారావు-సావిత్రిపై ఒకసారి, నాగేశ్వరరావు-జమునపై ఒకసారి విడివిడిగా చిత్రీకరించారు.
  7. ఇక 'ప్రేమ యాత్రలకు బృందావనమూ' పాట వెనుక కూడా ఓ చిత్రమైన చర్చ జరిగింది. పాటల రచయిత అయిన పింగళి చక్రపాణి దగ్గరకు వచ్చి 'తర్వాతి డ్యూయెట్‌ ఏ ప్రాంతంలో తీస్తున్నారు' అడిగారట. 'ఎక్కడో తీయటం ఎందుకు? పాటలో దమ్ముంటే విజయాగార్డెన్స్‌లోనే చాలు. ఊటీ, కశ్మీర్‌, కొడైకెనాల్‌ ఎందుకు?' అన్నారట. ఆయన అన్న మాటలను దృష్టిలో పెట్టుకుని, 'ప్రేమ యాత్రలకు బృందావనమూ' పాట రాశారు పింగళి.
  8. 'గుండమ్మ కథ' ఎన్టీఆర్‌ నటించిన 100వ చిత్రం. అప్పటికి ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో నట రారాజు. అలాంటి వ్యక్తి అంజి పాత్ర ఆయన ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా తనకు దీటుగా నటించే ఏయన్నార్‌ స్టైలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ మాత్రం సినిమాలో ఎక్కువభాగం నిక్కర్‌తో కనిపిస్తారు. అంతేకాదు, పిండి రుబ్బుతారు. నటనపై ఎన్టీఆర్‌కు ఉన్న నిబద్ధతకు ఈ సినిమా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
  9. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లు కలిసి నటిస్తే ఓ సమస్య తెరపై ముందు ఎవరి పేరు వేయాలి? 'గుండమ్మకథ'విషయంలోనూ ఇదే సమస్య వచ్చింది. దీనికి నాగిరెడ్డి చక్కని ఉపాయం ఆలోచించారు. అసలు తెరపై పేర్లే వేయకుండా ఫొటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. అలా సినిమా పేరు తర్వాత ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, సావిత్రి, జమున, ఎస్వీఆర్‌ ఫొటోలు పడతాయి. ఆ తర్వాత సూర్యాకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి ఫొటోలు వేశారు.
  10. 'గుండమ్మకథ' విడుదలకు 10రోజులు ఉందనగా, ఎల్వీ ప్రసాద్‌ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో ఈ సినిమాను ప్రదర్శించారు. అక్కడ తెరపై ఎన్టీఆర్‌ నిక్కర్‌తో కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న పిల్లలు అందరూ నవ్వేశారు. అదే సమయంలో కథ ఏమీ లేదని, సూర్యకాంతంలో గయ్యాళితనాన్ని సరిగా చూపించలేదనీ విమర్శలు వచ్చాయి. కానీ, వాటన్నింటినీ దాటుకుని 'గుండమ్మకథ' ఎవర్‌గ్రీన్‌ మూవీ అయింది. ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచే టాప్‌ క్లాసిక్‌ మూవీల్లో ఒకటిగా నిలిచింది. మరి ఇంతటి గొప్ప సినిమాను మళ్లీ ఎవరైనా రీమేక్‌ చేస్తే చూడాలని తెలుగు ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. అన్నీ ఉన్న అసలు సమస్య 'గుండమ్మ పాత్ర'.
గుండమ్మ కథలోని ఓ సన్నివేశం

ABOUT THE AUTHOR

...view details