ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నాటు నాటుకు, బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిమ్‌గా ది ఎలిఫెంట్ విస్పరర్స్‌కు ఆస్కార్ పురస్కారాలు వరించాయి. దీంతో భారతీయ సినీ ప్రేక్షకాభిమానులు అందరూ సంతోషంలో మునిగితేలుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో అకాడమీ చేసిన ఓ చర్యకు సినీ ప్రియులు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం సరికాదని అంటున్నారు. ఆస్కార్ దక్కించుకున్న ది ఎలిఫెంట్ విస్పరర్స్ నిర్మాతను అకాడమీ అలా చేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అలాగే ఆమె కూడా అకాడమీ చేసిన చర్యకు అసహనం వ్యక్తం చేసింది.
అసలేం జరిగిందంటే..సాధారణంగా ఆస్కార్ అందుకున్న తర్వాత 45 సెకన్లు మాట్లాడేందుకు ప్రతి ఒక్కరికీ ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అంతకు మించి ఎక్కువ సమయం తీసుకుని మాట్లాడితే వెంటనే ఆ స్పీచ్‌ను కట్ చేసి మ్యూజిక్ ప్లే చేస్తారు. అయితే ది ఎలిఫెంట్ విస్పరర్స్‌కు అవార్డు ప్రకటించిన అనంతరం డైరెక్టర్ కార్తీకి తనకిచ్చిన సమయంలోనే స్పీచ్‌ను ముగించారు. కానీ నిర్మాత గునీత్ మోంగా.. మాట్లాడటం ప్రారంభించకముందే సంగీతం ప్లే చేశారు. దీంతో ఆమె.. తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండానే వెనుదిరిగారు.