Godsee Hero Satyadev: "సమాజానికి.. మనిషికీ మధ్య జరిగే నిజమైన ప్రేమకథే 'గాడ్సే'. డ్రామా, ఎమోషన్స్, యాక్షన్.. ఇలా అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది" అన్నారు సత్యదేవ్. ఆయన హీరోగా గోపి గణేష్ పట్టాభి తెరకెక్కించిన చిత్రమే 'గాడ్సే'. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు సత్యదేవ్.
ఈ కథ వినగానే మీకెలాంటి అనుభూతి కలిగింది?
"ఓ నటుడిగా నేనెలాంటి కథైనా చేయగలనని నాకు గట్టి నమ్మకం. కాకపోతే కథ వినగానే 'నేను దీన్ని మోయగలనంటావా?' అని గోపి గణేష్‌ని అడిగా. తను అనుకున్న కథ నా ద్వారా అందరికీ రీచ్ అవుతుందని నమ్ముతున్నాడా? లేదా? తెలుసుకుందామని అలా అడిగా. ఈరోజు టీజర్, ట్రైలర్లకు దక్కుతున్న ఆదరణ చూస్తుంటే మా ప్రయత్నం అందరికీ కనెక్ట్ అయిందని అర్థమవుతోంది. సంతోషంగా ఉంది".
'గాడ్సే' టైటిల్ ప్రచారం కోసం పెట్టారా? ఈ కథకు బాగుంటుందని పెట్టారా?
"రెండు రకాలుగా ప్లస్ అవుతుందని పెట్టాం. మరీ బజ్ లేని టైటిల్ పెట్టినా.. ఎవరికీ నచ్చదు కదా. గాడ్సే పాత్ర వేసిన విద్యార్థి గాంధీని కాల్చనని చెప్పి వెళ్లిపోతాడు. అలాంటివాడు పెద్దయ్యాక రెండు తుపాకులు పట్టుకుని స్వైర విహారం చేస్తాడు. అయితే అతనలా ఆయుధం చేతబట్టడానికి వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. అదేంటన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. నిజానికి ఈ సినిమాలో హీరో పాత్ర అసలు పేరు విశ్వనాథ రామచంద్ర".