IIFA 2023 awards : దుబాయ్ వేదికగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు (ఐఫా)-2023 ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్, యంగ్ హీరో విక్కీ కౌశల్, వరుణ్ ధావన్, హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహి సహా పలువురు నటీనటులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. వేడుకలో భాగంగా భిన్న ఫ్యాషన్ డ్రెస్సులో గ్రీన్ కార్పెట్‌పై హొయలొలికించారు. కెమెరాలకు అదిరిపోయే పోజులు ఇవ్వడంతో పాటు స్టేజ్‌పై తమ అనుభవాలను మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఇక ఈ వేడుకలో 'ఐఫా 2023' టెక్నికల్ అవార్డులను అందజేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ.. ఇలా తొమ్మిది విభాగాల్లో ఈ పురస్కారాలను అందించారు. అయితే వీటిలో స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ వంటి కీలక అవార్డులను.. స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'గంగూబాయి కాఠియావాడి' అందుకుంది. ఆ తర్వాత యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ నటించిన 'భూల్ భూలయ్యా-2' రెండు పురస్కారాలను దక్కించుకుంది.
అవార్డులు-విజేతలు:
- బెస్ట్ సినిమాటోగ్రఫీ: సందీప్ ఛటర్జీ (గంగూబాయి కాఠియావాడి)
- బెస్ట్ డైలాగ్స్: ఉత్కర్షిణి వశిష్ఠ, ప్రకాశ్ కాపాడియా (గంగూబాయి కాఠియావాడి)
- బెస్ట్ స్క్రీన్‌ప్లే: సంజయ్ లీలా భన్సాలీ, ఉత్కర్షిణి వశిష్ఠ (గంగూబాయి కాఠియావాడి)
- బెస్ట్ కొరియోగ్రఫీ: బోస్కో-సీజర్ (భూల్ భులయ్యా-2)
- బెస్ట్ ఎడిటింగ్: సందీప్ ఫ్రాన్సిస్ (దృశ్యం 2)
- బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: రెడిఫైన్ (బ్రహ్మాస్త్ర)
- బెస్ట్ సౌండ్ డిజైన్: మందార్ కులకర్ణి (భూల్ భులయ్యా-2)
- బెస్ట్ సౌండ్ మిక్సింగ్: గుంజన్ ఏ షా, బోలోయ్ కుమార్ (మౌనికా ఓ మై డార్లింగ్)
- బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: శ్యామ్ సీఎస్ (విక్రమ్ వేద)