Gandeevadhari Arjuna Movie Review : చిత్రం: గాండీవధారి అర్జున; నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, బర్నాబాస్ రెటి,లీ నికోలస్ హారిస్,వినయ్ నలకడి, తదితరులు; సినిమాటోగ్రఫీ: ముఖేశ్; ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల; కళ: శివ కామేశ్; సంగీతం: మిక్కీ జె.మేయర్; నిర్మాణ సంస్థ: శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర; నిర్మాతలు: బీవీఎస్‌ఎన్ ప్రసాద్; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు; విడుదల తేదీ: 25-08-2023
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'గాండీవధారి అర్జున'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?
కథేంటంటే?
Gandeevadhari Arjuna Story :అర్జున్ (వరుణ్‌తేజ్) సోల్జర్‌గా పనిచేసిన ఓ యువకుడు. ఓ ఏజెన్సీ తరఫున యూకేలో అతను బాడీగార్డ్‌గా పనిచేస్తుంటాడు. జి-20 సదస్సు కోసం యూకే వెళ్లిన కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ బహదూర్ (నాజర్) ప్రాణ రక్షణ కోసం అర్జున్ రంగంలోకి దిగుతాడు. అయితే దేశం కాని దేశంలో ఆదిత్యరాజ్‌ని అంతం చేయాలనే కుట్ర వెనక ఎవరున్నారు? అందుకు కారణాలేమిటి? అత్యంత ప్రమాదంలో ఉన్న ఆయన ప్రాణాల్ని అర్జున్ కాపాడాడా? లేదా? అన్నదే ఈ సినిమా. ఇక కేంద్రమంత్రికి పర్సనల్ సెక్రటరీ అయిన ఐఏఎస్ ఐరా (సాక్షి వైద్య)కీ, అర్జున్‌కీ మధ్య సంబంధం ఏమిటి? ఈ కథలో సీ అండ్ జీ కంపెనీ అధినేత రణ్‌వీర్ (వినయ్ రాయ్) పాత్ర ఏమిటి? తదితర విషయాలే మిగతా కథ.
ఎలా ఉందంటే?
Gandeevadhari Arjuna Review :ఏం చెప్పామన్న విషయం కంటే ఎలా చెప్పామన్నదే సినిమాకి ఇంపార్టెంట్. అయితే కథలో ఎంత మంచి అంశం ఉన్నా సరే.. దాన్ని ఆసక్తికరంగా ప్రేక్షకులకు చెప్పకపోతే ఆ కథ ఇక వృథానే. సినిమాకి ఎన్ని హంగులు జోడించారు? హీరో ఎంత స్టైలిష్‌గా కనిపించాడు? మేకింగ్ ఎంత స్టైల్‌గా ఉందనే విషయాలు కొంతవరకు ప్రభావం చూపించొచ్చు కానీ.. సినిమాను గట్టెక్కించాల్సింది మాత్రం ఆసక్తికరమైన కథ, కథనాలే .
ఇక ఈ సినిమాలో లోటుపాట్లన్నీ కీలకమైన ఆ కథ, కథనాల విషయంలోనే కనిపిస్తున్నాయి. ట్రైలర్ చూస్తేనే కథ మొత్తం తెలిసిపోతుంది. అయితే తెరపై అదనంగా చూపించింది ఏమిటంటే.. స్టైల్‌గా కనిపించే హీరోతో పాటు విలన్ గ్యాంగ్ స్టైల్‌గా ఒకరినొకరు కాల్చుకోవడం. అమ్మ నేపథ్యంలో సన్నివేశాలు, అమ్మాయితో ప్రేమ నేపథ్యం ఉన్నప్పటికీ.. ఆ సన్నివేశాలు ఏమాత్రం హత్తుకునేలా అనిపించవు. ఇక ఉన్న కథనైనా కూడా మంచి మలుపులతో ఆసక్తికరంగా చెప్పారా అంటే అది కూడా లేదు. ఒక దాని వెనుక ఒకటి సన్నివేశాలు అలా సాగిపోతుంటాయి అంతే. ప్రపంచ దేశాల వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ నేపథ్యాన్ని ఎంచుకుని దానికి సెంటిమెంట్ కూడా జోడించే ప్రయత్నం చేసినా అది అనుకున్నట్లుగా కుదరలేదు. ఎంచుకున్న ఈ కథాంశం కూడా ఇదివరకు కొన్ని సినిమాల్లో స్పృశించిందే. దాంతో ఏ దశలోనూ సినిమా ఆసక్తి రేకెత్తించదు (Gaandeevadhari Arjuna Review). ప్రథమార్ధం తర్వాత చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగిపోతుంటాయి. పతాక సన్నివేశాలు.. కలుషితమవుతున్న పర్యావరణంపై తీసిన ఓ డాక్యుమెంటరీని చూపెడుతూ, ఉపదేశం ఇస్తున్నట్టే ఉంటాయి. హీరో స్టైల్‌గా కనిపించడం, అందమైన లొకేషన్లలో సినిమాని చిత్రీకరించడం మినహా ఇందులో ఆకట్టుకున్న విషయాలేవీ లేవు.
ఎవరెలా చేశారంటే?
Gandeevadhari Arjuna Telugu Review :అర్జున్ పాత్రకి తనవంతు న్యాయం చేశాడు వరుణ్ తేజ్ (Varun Tej). స్టైలిష్‌గా, బాడీగార్డ్ పాత్రకి తగ్గట్టుగా ఫిట్‌గా కనిపించాడు. యాక్షన్ సన్నివేశాల్లోనూ మెరిశాడు. అక్కడక్కడా భావోద్వేగాల్ని కూడా పండించే ప్రయత్నం చేశాడు కానీ.. సన్నివేశాల్లో బలం లేకపోవడంతో ఫలితం దక్కలేదు. సాక్షి వైద్య సినిమా మొత్తం కనిపిస్తుంది కానీ, ఆ పాత్రలో బలం లేదు. నటించేందుకు పెద్దగా ఆస్కారం దక్కలేదు. ప్రథమార్ధంలో వరుణ్‌తేజ్‌తో కలిసి చేసిన పాటలో అందంగా కనిపించింది (Gaandeevadhari Arjuna Review). నాజర్, విమలారామన్, వినయ్ రాయ్ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. అభినవ్ గోమటం, రవివర్మ తదితరుల పాత్రలు పెద్దగా ప్రభావం చూపించవు. సాంకేతిక విభాగాల్లో కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు పడతాయి. ఛాయాగ్రాహకులు ముఖేష్, అమోల్ రాథోడ్ కథా నేపథ్యాన్ని అందంగా చూపించారు. మిక్కీ జె.మేయర్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. ఒక స్టైలిష్ యాక్షన్ సినిమాకి తగ్గట్టుగానే రాజీ లేకుండా నిర్మాణం చేశారు. రచన పరంగానే ఈ సినిమాకి సమస్యలన్నీ. మేకింగ్‌లో దర్శకుడి అభిరుచి కనిపించినా కథ, కథనం పరంగా చేసిన కసరత్తులు పేలవం (Gaandeevadhari Arjuna Review).
- బలాలు
- + స్టైలిష్‌గా సన్నివేశాలు
- బలహీనతలు
- - ప్రభావం చూపించని కథ
- - కొత్తదనం లేని కథనం
- - థ్రిల్ పంచని యాక్షన్
- చివరిగా: విషయం లేదు అర్జునా..!
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!