Game Changer Leaked Song : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'గేమ్ ఛేంజర్'. అయితే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయమై సినిమా నిర్మాత దిల్రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందుకు కారణమైన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"తెలుగు చిత్ర పరిశ్రమలో నేను (దిల్రాజు) ఓ నిర్మాత. ఇప్పటికి 50కి పైగా సినిమాలు నిర్మించాను. పైన తెలిపిన విధంగా ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' అనే సినిమా రూపొందిస్తున్నా. అయితే రీసెంట్గా ఈ సినిమా నుంచి 'జరగండి.. జరగండి' అనే పాటను ఎవరో లీక్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాబట్టి ఈ సాంగ్ లీక్ వ్యవహారంలో ఉన్న వారిని పట్టుకొని లీగల్ యాక్షన్ తీసుకోగలరు. ఇక ఈ పాటను వాట్సాప్ సహా.. ఇతర సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోగలరు" అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
లీక్ వ్యవహారంపై మెగా ఫ్యాన్స్ ఫైర్.. ఈ సాంగ్ లీక్పై మెగా ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఎంతో ఖర్చుపెట్టి నిర్మాత సినిమా తీస్తారని.. అక్రమంగా ఇలా పాట లీక్ చేయడం సరికాదని ఫ్యాన్స్ అంటున్నారు. పాటను స్ర్పెడ్ చేయవద్దంటూ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు.