Gaddar Movie songs : అన్యాయాలపై పోరాటం.. ఉద్యమాలకు ఊపిరి పోయడం.. యువతలో ఉత్తేజం నింపడమే లక్ష్యంగా ఆయన పాట వినిపించేది. తూటాలతోనే కాదు, పాటలతోనూ విప్లవాన్ని సృష్టించవచ్చని నిరూపించారు ప్రజా గాయకుడు గద్దర్. నేడు(ఆగస్ట్ 6) గద్దర తుదిశ్వాస విడవడంతో ఉద్యమగళం మూగబోయినట్టైంది. ప్రజా సమస్యలపై పాట రూపంలో కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన ఆయన.. వెండితెరపైనా కూడా పాటల రూపంలో మెరిశారు.
'మాభూమి' చిత్రం కోసం తొలిసారి పాట పాడి నటించారు గద్దర్. ప్రజా సమస్యలను చూపిస్తూ రూపొందించిన చిత్రం మాభూమి. ఇందులో సాయిచంద్, రామిరెడ్డి, తెలంగాణ శకుంతల ప్రధాన పాత్రలు పోషించారు. గౌతమ్ ఘోష్ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో 'బండెనక బండి కట్టి' సాంగ్‌లో గద్దర్ కనిపిస్తారు. ఒకప్పుడు ఏ ప్రజా ఉద్యమం జరిగినా ఈ పాటే వినిపించేది.
ఆర్ నారాయణమూర్తి 'ఓరేయ్ రిక్షా' చిత్రంలోనూ గద్దర్ రాసిన 'మల్లెతీగకు పందిరి వోలే' పాట ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. అన్నా చెల్లిళ్ల అనుబంధం తెలుపుతూ వచ్చిన ఈ పాట.. రాఖీ పండగ వచ్చిందంటే చాలు రేడియో, టీవీల్లో ఇదే వినిపిస్తుంది. ఈ సాంగ్‌కు ఉత్తమ గేయ రచయితగా గద్దర్‌కు, ఉత్తమ గాయకుడిగా వందేమాతరం శ్రీనివాస్‌లకు నంది అవార్డు కూడా వరించింది. కానీ దీన్ని వీరిద్దరూ తిరస్కరించారు.