Horror Suspense Korean Movies : ఒకే జానర్లో వచ్చే సినిమాలు సినీ ప్రియులందరికీ నచ్చుతాయని చెప్పలేము. ఒక్కో వ్యక్తికి ఒక్కో ఫాంటసీ ఉంటుంది. కొందరికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ సినిమాలు నచ్చితే.. మరికొందరు యాక్షన్ డ్రామా సినిమాలను ఇష్టపడతారు. స్ట్రాంగ్ లీడ్ లేకున్నా.. కామెడీ ఉంటే చాలనుకునేవారు కొందరైతే.. హర్రర్ సస్పెన్స్ సన్నివేశాలు లేనిదే సినిమా ట్రైలర్ కూడా చూడరు మరికొందరు.
అయితే వెన్నులో వణుకు పుట్టించే హర్రర్ స్టోరీలకు కొరియన్ సినిమాలు పెట్టింది పేరు. ఇప్పటికే కొరియా నుంచి అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలై.. సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మన దగ్గర కూడా మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ వేదికల్లో అందుబాటులో ఉన్న టాప్ కొరియన్ హర్రర్ సినిమాలేంటో ఓ సారి చూసేద్దామా..
1. ది వెయిలింగ్ (2016)
The Wailing : ఒకానొక గ్రామంలోకి ఓ తెలియని వ్యక్తి ప్రవేశిస్తాడు. అయితే అతని రాకతో అక్కడ తెలియని రోగం వ్యాపించి వరుస మరణాలు సంభవిస్తాయి. దీంతో అదే ప్రాంతానికి చెందిన ఓ పోలీస్ అధికారి.. ఈ మిస్టరీని ఛేదించేందుకు ముందుకొస్తాడు. ఇంతకీ ఆయన ఆ రహస్యాన్ని ఛేదిస్తాడా లేదా అనేదే 'ది వెయిలింగ్' స్టోరీ. ఈ సినిమా 2016లో విడుదలైంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
2. ది హోస్ట్ (2006)
The Host : రాక్షస మృగం ఓ యువతిని కిడ్నాప్ చేస్తుంది. ఆ యువతిని కాపాడుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నమే 'ది హోస్ట్'. కుటుంబ విలువలు, బంధాలు, బంధుత్వాల నేపథ్యంలో సాగుతూ.. నవ్విస్తూ, భయపెడుతుంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా ఎమ్ఎక్స్ ప్లేయర్లో అందుబాటులో ఉంది.