ఒక్కప్పటి నుంచి ఇప్పటివరకు చిత్రసీమలో ఎన్నో మార్పులు జరిగాయి. ట్రెండ్ కూడా పూర్తిగా మారిపోయింది. నాలుగు ఫైట్లు, ఆరు పాటలనే రొటీన్ ఫార్ములాకు భిన్నంగా ఇప్పటి సినిమాలు రూపొందుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో అగ్ర కథానాయకులు ప్రయోగాలు చేయడానికి తెగువ చూపుతుంటే.. వాళ్లను ప్రోత్సహించడానికి దర్శక నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు. అందుకే ఇప్పటి కాలంలో ప్రేక్షకులకు కొత్త తరహా కథలు చూసే అవకాశం దక్కుతోంది. అగ్ర తారల నుంచి అప్‌కమింగ్ యంగ్ హీరోల సినిమాల వరకు ఎన్నో చిత్రాలు వైవిధ్యతను సంతరించుకుని సరికొత్తగా వెండితెరపై కాంతులీనుతున్నాయి. దీని ఫలితంగానే తెలుగు చిత్రసీమ ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొంది అందరి మన్ననలు అందుకుంటోంది.
" ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రయోగం చేయడాన్ని ఓ సాహసోపేతంగా విషయంగా చూసేవారు. కానీ.. ఇప్పుడు ఇదే విజయ సూత్రంగా మారిపోయింది. అయితే రొటీన్ కమర్షియల్ సినిమా చేయడాన్ని నిర్మాతలే సాహసంగా చూసే పరిస్థితులొచ్చాయి". - ఇటీవలే ఓ యువ దర్శకుడు వ్యాఖ్యానించిన మాట ఇది. ఇదే అక్షర సత్యం కూడా. అయితే ఈ మార్పును అగ్ర తారలు గుర్తించి, స్వాగతిస్తున్నారు. అందుకే క్రమ క్రమంగా తమకున్న ఓల్డ్ ఇమేజ్ నుంచి బయట పడే మార్గాల్ని అన్వేషిస్తున్నారు. 'కొత్తగా ప్రయత్నిస్తే పోయేదేముంది?' అంటూ తెగువ చూపించి నయా ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు. దీంతో దర్శకులు సైతం వాళ్ల ఇమేజ్‌కు తగ్గట్లుగానే వైవిధ్యభరితమైన కథలు సిద్ధం చేస్తున్నారు.
కొత్తదనం నిండిన కథలతో పాటు .. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలోనూ ఎప్పుడూ ముందుంటారు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున. అందుకే ఇప్పుడు ఆయన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో కలిసి ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది నాగ్‌కు ఓ కొత్త తరహా ప్రయత్నమే అని చెప్పాలి. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాతో ఆయన సరికొత్త మాస్ లుక్‌తో కనువిందు చేయనున్నారు. కాగా ఇందుకోసం ఇప్పటికే తన లుక్‌ను కూడా మార్చుకున్నారు నాగ్. అంతే కాదు ఇందులో ఆయన పాత్ర రెండు కోణాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే నెలలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం.
ఇక ఈ సంక్రాంతికి 'వీరసింహారెడ్డి'తో హిట్ టాక్ అందుకుని ఆ జోరును ఆస్వాదిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన 'ఎఫ్3' దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ మాస్ యాక్షన్ చిత్రం చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో బాలయ్యను సరికొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు అనిల్. బాలకృష్ణ లుక్ నుంచి డైలాగ్స్ వరకు ప్రతి విషయంలోనూ కొత్తదనం కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందనున్న ఈ సినిమా కోసం అదే యాసలో బాలయ్య డైలాగ్ డెలివిరీ ఉండనుంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.