Actors Turned Directors : ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఆన్‌స్క్రీన్‌పై తమ నటనతో అలరిస్తుంటారు. అయితే అందులో కొంత మంది మాత్రం మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్‌గానూ మారిన సందర్భాలున్నాయి. ఓ హీరోగా తెరపై తమను చూపించినట్లే.. ఓ దర్శకుడిగా తమ దృష్టికోణాన్ని ప్రేక్షకులకు చూపిస్తుంటారు. అటు నార్త్ నుంచి ఇటు సౌత్ వరకు ఎందరో స్టార్స్ అప్పుడప్పుడు రచయితలుగా, దర్శకులుగా మారిన వారు ఉన్నారు. అయితే ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్‌లో ఉంటూ డైరెక్షన్‌ను మరిచిపోయిన ఈ తారలు.. చాలా గ్యాప్ తర్వాత మరోసారి యాక్షన్ అంటూ మెగాఫోన్‌లో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ వారెవరంటే..
Dhanush Directed Movies : కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ప్రస్తుతం వరుస సినిమాల షూట్లతో బిజీగా ఉన్నారు. ఇక తన బిజీ షెడ్యూల్లోనే తన 50వ సినిమా కోసం ఆయన మెగాఫోన్ పట్టనున్నారు. 'పా. పాండి' (2017) సినిమాతో తొలిసారిగా దర్శకుడైన ధనుశ్.. దాదాపు ఆరేళ్ల తర్వాత దర్శకుడయ్యారు. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను ఆయన తెరకెక్కించనున్నారు. యంగ్ హీరో సందీప్ కిషన్, అనిఖా సురేంద్రన్, ఎస్‌జే సూర్య, విష్ణు విశాల్, వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
Upendra Directed Movies : కన్నడ నటుడు ఉపేంద్రకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ఓ నటుడిగానే కాదు ఓ దర్శకుడిగానూ మంచి మార్కులు కొట్టేశారు. 'ష్..! (1993)', 'ఓం (1995)', 'ఉపేంద్ర (1999)' లాంటి సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చినవే. ఇందులో ఆయన నటించారు కూడా. ఇక శాండల్‌వుడ్‌లో సూపర్‌హిట్ అయిన ఈ సినిమాలు తెలుగులో డబ్ అయి ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ 2015లో వచ్చిన 'ఉప్పి 2' తర్వాత దర్శకత్వానికి కొంచం బ్రేక్ ఇచ్చారు. ఇక ఏడేళ్ల తర్వాత 2022లో 'యూఐ' అనే సినిమా తెరకెక్కించనున్నారు.