First 100 Crore Film In India : బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మార్క్ దాటడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. కంటెంట్ పరంగా మంచిగా ఉన్న సినిమాలన్నీ ఇప్పుడు 100 కోట్లు కాదు 200 కోట్లు కాదు ఏకంగా వెయ్యి కోట్ల మర్క్ కూడా దాటిన సందర్భాలను మనం చూస్తున్నాం. కొన్ని సార్లు కంటెంట్ వర్కౌట్ కాకపోయినా.. సినిమాలు కమర్షియల్‌గా హిట్ కొట్టేస్తుంటాయి. అలా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్క్‌ను దాటిన సినిమాలు నార్త్ టు సౌత్ చాలానే ఉన్నాయి. ఇందులో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, అజయ్ దేవగణ్, హృతిక్ రోషన్‌తో పాటు తెలుగులో ప్రభాస్, అల్లు అర్జున్ సహా పలువురు సూపర్ స్టార్లకు చెందిన సినిమాలు ఉన్నాయి.
అయితే ఇండియాలో ఈ వంద కోట్ల మార్క్‌ను ట్రెండ్ సెట్ చేసిన మొదటి హీరో ఎవరో తెలుసా? ఆయనే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. ఈయన నటించిన 'గజినీ' సినిమాతో భారత్‌లో ఈ ట్రెండ్ మొదలైంది. 2008లో విడుదలైన ఈ చిత్రం వంద కోట్ల మార్క్‌ను దాటి రికార్డుకెక్కడమే కాకుండా.. ఆమిర్ ఖాన్‌కు మరింత స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'త్రీ ఇడియట్స్', 'పీకే', 'దంగల్' లాంటి సినిమాలు కూడా వంద కంటే ఎక్కువ కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించాయి. అలా ఆయన లిస్ట్‌లో ఆరు సినిమాలు ఈ మార్క్‌ను అందుకున్నాయి.
Salman Khan 100 Crore Club Movies : ఇక ఆయన తర్వాత ఈ లిస్ట్‌లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఉన్నారు. గత 13 ఏళ్లలో ఆయన నటించిన 'రాధే', 'అంతిమ్' తప్ప మిగతావన్నీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మార్క్ దాటినవే. ఆయనకు సంబంధించిన 16 సినిమాలు ఈ 100 కోట్ల క్లబ్లో ఉండటం విశేషం. ఇక ఇటీవలే 'ఓ మై గాడ్ 2' సినిమాతో బాలీవుడ్లో సెస్సేషన్ క్రియేట్ చేసిన అక్షయ్ కుమార్ సినిమాలు కూడా ఎన్నో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఆయన నటించిన వాటిలో దాదాపు 15 సినిమాలు బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మార్క్ దాటినవే.
ఇక సల్మాన్, అక్షయ్ తర్వాత అజయ్ దేవగణ్ వద్ద 12 సినిమాలు ఉండగా.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దగ్గర 8 వంద కోట్ల మార్క్ సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ డ్యాన్సింగ్ మెషిన్ హృతిక్ రోషన్ వద్ద 6 సినిమాలు ఉన్నాయి. ఇక రణ్వీర్ సింగ్ దగ్గర 5 వంద కోట్ల మార్క్ సినిమాలు ఉన్నాయి.