తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రియల్​ లైఫ్​లో ఒంటరిని.. సాయిపల్లవే ఆ లోటు తీర్చింది' - ఫిదా సినిమా నటుడు సాయిచంద్​

నిజ జీవితంలో నాన్న పాత్రకి దూరంగా ఉన్న నటుడు సాయిచంద్.. తెలుగు చిత్రసీమలో తండ్రి పాత్రలకి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. నేడు పితృదినోత్సవం సందర్భంగా ఆయన తన గురించి పలు విషయాలను తెలిపారు. ఇందులో భాగంగానే నటి సాయిపల్లవితో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఆ సంగతులివీ...

saichand saipallavi
సాయిచంద్​ సాయిపల్లవి

By

Published : Jun 19, 2022, 6:44 AM IST

Updated : Jun 19, 2022, 7:25 AM IST

నేను హీరోనైతే... ఆయన నా తొలి అభిమాని
నేను దర్శకుడినైతే... ఆయన నాకు చప్పట్లు కొట్టే ప్రేక్షకుడు
నేను సినిమానైతే... ఆయన నన్ను నిర్మించే నిర్మాత.
నేను రోజూ చదివే పుస్తకం... నా గెలుపులో ఎగరవేసే పతాకం... నాన్న!
నాకు భయమేస్తే... ధైర్యం చెప్పే హీమెన్‌
నాకు కష్టమొస్తే... కాచుకోగల ఐరెన్‌మెన్‌
నాకు కన్నీళ్లొస్తే.. తుడిచేసే స్పైడర్‌మెన్‌
నాకు ఓటమొస్తే... గెలిచేదాకా నన్ను మోసే సూపర్‌మెన్‌

ఇంత మంది సూపర్‌ హీరోలు కలిసిన ఆయన నా జీవితానికి నిజమైన నాయకుడు. బిడ్డలు శిల్పాల్లా నిలవడానికి... ఉలి దెబ్బలు తిని రాలి పడిన.. నాన్నలందరికీ తండ్రులదినోత్సవ శుభాకాంక్షలు! అందరి జీవితాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న నాన్నల గురించి స్మరించే రోజు పితృదినోత్సవం. ఈ సందర్భంగా తెలుగు చిత్రసీమలో తండ్రి పాత్రలకి కేరాఫ్‌గా నిలుస్తున్న సాయిచంద్​ గురించి ప్రత్యేక కథనం. 'ఫిదా', 'ఉప్పెన', 'కొండపొలం', 'విరాటపర్వం' సినిమాల్లో నాన్నగా ఆయన గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. నిజ జీవితంలో నాన్న పాత్రకి దూరంగా ఉన్న ఆయన సినిమా నాన్నగా పలు విషయాల్ని పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే...

"చాలా సినిమాల్లో నాన్న పాత్రల్ని చూస్తుంటాం. వాటిలో కొన్నే మనసుల్ని తాకుతాయి, హృదయాల్లో నిలిచిపోతాయి. అలా నా మనసులో నిలిచిపోయింది 'మహానది' సినిమాలో కమల్‌హాసన్‌ పాత్ర. కూతురు కోసం అన్వేషించే తండ్రిగా అందులో కనిపిస్తారు. ఇక దక్షిణాదిలోనే నాకు అత్యంత ఇష్టమైన నటుడంటే ఎస్వీ రంగారావు. ఆయన చేసిన ప్రతీ పాత్ర ఇష్టమే. తండ్రి, తాత పాత్రల్లో గొప్ప ఆర్ధ్రతని పండించారు. వారి నటనని చూసి ఆస్వాదించడమే తప్ప, నేను తండ్రిగా నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నిజ జీవితంలో నేను ఒంటరినే. రెండున్నర దశాబ్దాలకిపైగా నటనకి దూరంగా ఉన్న సమయంలో శేఖర్‌ కమ్ముల 'ఫిదా'లోని తండ్రి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. మాది ఉమ్మడి కుటుంబం. మేం మొత్తం ఆరుగురం. నేను చిన్నవాణ్ని. అక్క పిల్లలు, అన్నయ్య పిల్లలు నా ఒళ్లోనే పెరిగారు. కానీ తండ్రి అనుభూతి ఎలా ఉంటుందో, దాన్ని పక్కాగా తెరపైన చూపిస్తానో లేదో అనే భయం ఉండేది. అందుకే శేఖర్‌ కమ్ముల 'ఫిదా'లో తండ్రిగా చేయాలని అడిగినప్పుడు సంకోచించా. 'మీరు 21 ఏళ్లు ఉన్నప్పుడే 'మా భూమి'లో తెలంగాణ రైతాంగ పోరాట నాయకుడి పాత్ర చేశారు, ఈ పాత్రనీ అలవోకగా చేస్తారు' అన్నాడు. ఆయన నమ్మకంగా ఉన్నా, నేను అన్యమనస్కంగానే ఒప్పుకున్నా. ఆ తర్వాత నాకు కూతురుగా నటించేదెవరు? అని అడిగితే 'ప్రేమమ్‌' కథానాయిక సాయిపల్లవి అని చెప్పారు. అప్పటికి నేను ఆ సినిమా చూడలేదు. సాయిపల్లవి ఫొటోని చూపించారు. ఆ ఫొటో చూడగానే నా మనసు 'నువ్వు చేయాల్సిందే...' అని చెప్పింది. 15 రోజుల తర్వాత శేఖర్‌ కమ్ముల రిహార్సల్స్‌ కోసం నన్ను, సాయిపల్లవిని పిలిచారు. ఓ సన్నివేశంలో నటించి చూసుకుని తిరిగొస్తున్నప్పుడు 'నాన్న... మనం మళ్లీ కలుద్దాం' అంటూ నా దగ్గరికొచ్చింది. నాన్నా.. అని సాయిపల్లవి పిలవగానే నాలో తండ్రితనం బయటికొచ్చిందో ఏమో అప్పట్నుంచి నిజమైన తండ్రీ కూతుళ్లే అయిపోయాం. ఆ అమ్మాయికి తండ్రిగా నటించడం సృష్టి ఇచ్చిన ఓ అపూర్వమైన కానుక అనిపించింది.

ప్రతీ విషయంలోనూ శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టా. స్క్రిప్ట్‌లో భాను అనే పేరే తప్ప తల్లీ, బిడ్డ అనే మాటలు లేవు. నాలో తండ్రితనం వచ్చేసింది కదా అందుకే 'అది కాదు బిడ్డా, అలా కాదు తల్లీ' అంటూ సంభాషణల్ని తిరిగి రాసుకుని చెప్పా. శేఖర్‌ కమ్ముల ఎంతగా మెచ్చుకున్నారో! నిజ జీవితంలో నా చిన్న వయసులోనే మా అమ్మానాన్నలు చనిపోయారు. పిల్లలపై అది ఎంత ప్రభావం చూపిస్తుందో నాకు తెలుసు. 'ఫిదా'లో నా కూతుళ్లకి తల్లి ఉండదు. నాన్నంటే నాన్నే కాదు, ఆయనలో అమ్మ ఉంటుంది. అందుకే అమ్మతనాన్ని జోడిస్తూ ఇద్దరి కూతుళ్లకి తండ్రిగా ఆ పాత్ర చేశా. మీరు గమనిస్తే తండ్రిగా ఆవేశపడినా, ఆ వెంటనే అనునయాన్ని ప్రదర్శిస్తుంటుందా పాత్ర. 'ఉప్పెన'లోనూ అంతే. అందులో కథానాయకుడికి అమ్మ ఉండదు. అందుకే అమ్మతనాన్ని జోడిస్తూ ఆ పాత్ర చేశా. ఓ సందర్భంలో 'ఒరేయ్‌... అమ్మే చెప్పిందనుకోరా' అనే డైలాగ్‌ చెబుతాను. ఆ సినిమాల విడుదల తర్వాత మా నాన్నని మీ పాత్రల్లో చూసుకున్నాం అని చెప్పినవాళ్లు ఎంతోమంది. 'ఫిదా' తర్వాత ఆ పాత్ర అలా నిలిచిపోవాలనుకున్నా. అందుకే ఆ తర్వాత 50 సినిమాలకి తండ్రి పాత్రల కోసం అవకాశాలు వచ్చాయి. అన్నిటినీ తిరస్కరించి చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'లో ఓ కీలకమైన పాత్ర ఒప్పుకొన్నా. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడే చిరంజీవి పిలిచి 'ఉప్పెన'లో తండ్రి పాత్ర గురించి చెప్పారు. ఎలాగోలా తప్పించుకోవాలని 'సైరా నరసింహారెడ్డి' పాత్ర కోసం గడ్డం పెంచాను, 'ఉప్పెన' చేయలేనని చెప్పా. ఆయన 'లేదు, ఈ పాత్ర బాగుంటుంద'ని నన్ను ఒప్పించారు. సాయిపల్లవి 'కొడుకు పాత్రకీ తండ్రిగా నటించండి నాన్నా' అని చెప్పింది. ఆ సినిమాతోనూ చాలా పేరొచ్చింది. సాయి తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. వైష్ణవ్‌కి 'కొండపొలం'లోనూ తండ్రిగా నటించా. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ... ఇలా అన్ని యాసలూ పలికే అవకాశాన్ని తండ్రి పాత్రలే ఇచ్చాయి. వేణు ఊడుగుల నాకు ఎప్పట్నుంచో పరిచయం. 'విరాటపర్వం' కోసం రాముడు అనే మరో గొప్ప తండ్రి పాత్రని సృష్టించారు. ఆ పాత్రలో మరోసారి సాయిపల్లవికి తండ్రిగా నటించడం గొప్ప అనుభవం. నాన్నా, మళ్లీ కలుస్తామో లేదో... అంటూ సాయిపల్లవి అడవుల్లోకి వెళ్లే సన్నివేశం నా మనసుని పిండేసింది. అదేమిటో తెలియదు కానీ... ఎవరితో కలిసి నటించినా సన్నివేశం పూర్తయ్యాక మామూలుగా మారిపోతాను. సాయిపల్లవితో కలిసి నటించాక తొందరగా ఆ ప్రభావం నుంచి బయటికి రాలేను. సాయిపల్లవి నా జీవితంలోకి వచ్చాక తండ్రిగా నేను మిస్‌ అయిన అనుభూతులన్నీ ఆ అమ్మాయి ఇచ్చింది. ఇప్పటికీ ఆమె నన్ను నాన్న అనే పిలుస్తుంది, నేను కన్నా అంటుంటా. నేను జీవితంలో తండ్రి కాకపోయినా... నాన్నగా మారిపోయా" అని అన్నారు.

ఇదీ చూడండి: క్షమాపణలు చెప్పిన సాయిపల్లవి.. వాళ్లకు మాత్రం కృతజ్ఞతలంటా..!

Last Updated : Jun 19, 2022, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details