స్టార్ హీరోల సినిమాలు, పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఫుల్ లెన్త్ అయినా లేదా కెమియో అయినా. ఏ మాత్రం కాస్త ఏమరుపాటుగా ఉన్నా.. ఆ ప్రభావం వారిపై పడుతుంది. వారి ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఒక్కోసారి ఎక్స్పెరిమెంట్ చేసి బోల్తా పడినా.. ఆ తర్వాత అలాంటి సాహసాలు చేయరు హీరోలు. అయితే ఇప్పుడీ విషయం ఎందుకంటే.. విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం అలాంటి పొరపాటే చేస్తున్నారనిపిస్తోంది.
తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి'విక్టరీ'ని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. కొన్నిసార్లు ట్రాక్ తప్పినా.. మళ్లీ మంచి కంటెంట్ ఉన్న చిత్రాలతో కమ్‌బ్యాక్ ఇచ్చి సక్సెస్‌లను అందుకున్నారు. ప్రస్తుతం కాలానికి అనుగుణంగా కెరీర్లో ముందుకెళ్తున్నారు వెంకటేశ్. నవతరం స్టార్లతో జోడీ కడుతూ.. ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు. మరోవైపు తన వయసుకు తగ్గ పాత్రలతోనూ సందడి చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొంతకాలంగా సినిమాల విషయంలో ఆయన ఎక్స్పెరిమెంట్లు కాస్త గాడి తప్పినట్టు కనిపిస్తోంది. 'నారప్ప'తో సూపర్ హిట్ అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత గత మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. రీసెంట్గా వచ్చిన సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'లో హీరోయిన్ పూజా హెగ్డేకు అన్నయ్య పాత్ర చేశారు. ఇది ఆయనకు ఎలాంటి పేరును తీసుకురాలేకపోయింది. నిజానికి ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పటి నుంచే విమర్శలను ఎదుర్కొంది. అంతకుముందు 'రానా నాయుడు' వెబ్‌సిరీస్‌లో బోల్డ్ కంటెంట్‌తో కనిపించి అలరించడానికి ప్రయత్నించారు. కానీ అది వెంకీపై నెగటివిటీని తీసుకొచ్చింది. ఫ్యామిలీ హీరోగా ఇమేజ్ ఉన్న ఆయన బోల్డ్ కంటెంట్‌ను ఎంచుకోవడం వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చలేదు. దాని కన్నా ముందు విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' చిత్రంలో దేవదూత పాత్రను పోషించారు. ఆ క్యారెక్టర్ కూడా ఆడియెన్స్‌కు కనెక్ట్ అవ్వలేదు. సినిమా స్కేల్‌ను పెంచలేదు. అలా ఆయన నటించిన మూడు సినిమాలు ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోయాయి. దీంతో సినీ ప్రియులు.. వెంకీ 75వ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ 'సైంధవ్'పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఈ సినిమా ఏం చేస్తుందో..