విడుదలైన (లిరికల్ సాంగ్) క్షణం నుంచే సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన గీతం 'నాటు నాటు'. ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ఈ మాస్ పాట విదేశీయులనూ విశేషంగా అలరించింది. సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫుల్ వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో లిరికల్ వీడియోలోనే కాస్త రుచి చూసిన వారికి ‘ఇది ఫుల్ మీల్స్’ అనిపించేలా ఉంది.
ఈ పాటలో కథానాయిక ఒలివియా మోరిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఇద్దరితో కలిసి కొన్ని స్టెప్పులేసి సందడి చేసింది. చంద్రబోస్ రచించిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ప్రేమ్ రక్షిత్ నృత్య రీతులు సమకూర్చారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రూ.1000 కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది.