Pathaan: షారుక్ ఫ్యాన్స్ హంగామా.. భారీ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ.. - థియేటర్ల వద్ద అభిమానుల సందడి
షారుక్ ఖాన్ , దీపికా పదుకొణె జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. బుధవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈనేపథ్యంలో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది.
బాలీవుడ్ బాద్షా సినిమా అంటే మామూలుగా ఉండదు అని షారుక్ ఖాన్ అభిమానులు మరోసారి నిరూపించారు. పఠాన్ సినిమా విడుదల సందర్భంగా.. తగ్గేదేలే అన్నట్లుగా థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ నటించిన సినిమా విడుదల కావడంతో ఆయన అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ముంబయితోపాటు వివిధ ప్రాంతాల్లోని థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలు చేస్తున్నారు. మరోవైపు థియేటర్లలోనూ ఇదే సందడి కనబడుతోంది. షారుఖ్ ఎంట్రీ సీన్స్ సమయంలో అభిమానులు.. 'ఎస్‌ఆర్‌కే' అంటూ కేకలు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లలో షారుఖ్ నటన, దీపికా పదుకొణె - షారుఖ్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అదరిపోయిందని, ముఖ్యంగా సల్మాన్ - షారుఖ్ సీన్స్ బాగున్నాయని, సినిమా తమకు నచ్చిందంటూ పలువురు నెటిజన్లు ట్విటర్ వేదికగా రివ్యూలు పెడుతున్నారు. అంతేకాకుండా తమ నాలుగేళ్ల ఆకలిని ఈ సినిమా తీర్చిందని అంటున్నారు.