ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కేకే (53) ఆకస్మికంగా కన్నుమూశారు. కేకే పేరుతో ప్రసిద్ధి గాంచిన కృష్ణకుమార్ కున్నాథ్ కోల్‌కతాలోని ఓ హోటల్‌లో కుప్పకూలిపోయారు. నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన అనంతరం హోటల్‌కు చేరుకున్న కేకే అనంతరం ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం. దీంతో వెంటనే అతడిని నగరంలోని సీఎంఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. అనంతరం డాక్టర్లు పరీక్షించి కేకే మరణించినట్లు ధ్రువీకరించారు. కేకే మరణించడానికి కంటే ముందు తను ప్రదర్శన ఇస్తున్న పోస్టులను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
దిల్లీలో జన్మించిన కేకే 1999లో బాలీవుడ్ చిత్రం పాల్ సినిమాతో పరిచయమయ్యారు. అనంతరం పలు హిట్ సాంగ్స్ పాడి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో నేపథ్య గాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లో పాటలు పాడారు.