Fahadh Faasil in Nayakudu : తమిళంలో విడుదలై అనూహ్య విజయాన్ని అందుకుంది 'మామన్నన్' సినిమా. తెలుగులో ఇదే సినిమాను 'నాయకుడు'గా తెరకెక్కించారు. వడివేలు, ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేశ్, ఫహాద్ ఫాజిల్, లాంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అయితే ఇందులో హీరో క్యారెక్టర్ కంటే విలన్ క్యారెక్టర్‌కే అక్కడి ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. హీరోతో పాటు అతడి తండ్రి క్యారెక్టర్ హైలైట్ అవ్వాల్సిన ప్లేస్‌లో విలన్ క్యారెక్టర్‌కు ప్రేక్షకాదరణ లభించింది. దీనికి కారణం ఆ క్యారెక్టర్‌ను అంతలా లీనమై పోషించిన వ్యక్తి. ఆయనే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్.
తమిళంతో పాటు మలయాళంలోనూ ఎన్నో సినిమాల్లో తన విలక్షణ నటనతో ప్రేక్షకలను కట్టిపడేసిన ఆయన ఈ సినిమాలోనూ తన నటవిశ్వరూపాన్ని చూపించి అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి పేరు పొందారు. రత్నవేలు గౌండర్గా కనిపించిన ఆయన తనదైన శైలిలో విలనిజం పండించి ఇప్పటి వరకు తమిళ ఇండస్ట్రీలో విలక్షణ విలన్స్‌గా పేరొందిన స్టార్స్ జాబితాలోకి చేరిపోయారు.
Nayakudu Movie Cast : మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ 'మామన్నన్' ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ పొందింది. కథతో పాటు సినిమాలోని పాత్రల నటన మనసుకు హత్తుకునేలా ఉందటం వల్ల ఈ సినిమాకు అందరూ బాగా కనెక్టయ్యారు. యువ రాజకీయ నాయకుడు రత్నవేలుగా ఫహాద్ ఫాజిల్ జీవించారు. ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తిగా, తాను అనుకున్నది సాధించే మొండివాడిగా ఆయన నటన, హావభావాలు కట్టిపడేస్తాయి. మొదట్లో క్రూరుడిగా, బలమైన వ్యక్తిగా ఆ పాత్రను చూపించినా, సెకెండ్ హాఫ్ వచ్చేసరికి బలహీన పడిపోయింది. అయినప్పటికీ తన నటనతో రెండింటినీ బ్యాలెన్స్ చేశారు. దీంతో నెట్టింట ఎక్కడ చూసిన ఆయన పాత్ర గురించి టాక్. సినిమాలో ఫహాద్ నటించిన పలు సీన్స్‌ను మీమ్స్, రీల్స్ రూపంలో ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
Famous Villian Characters In Tamil Industry : సాధారణంగా కొన్ని సినిమాల్లో హీరో క్యారెక్టర్ కంటే విలన్ క్యారెక్టరే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మనం ఇప్పటి వరకు చూసిన కథల్లో విలన్‌ను కరుడుగట్టిన వాడిలా చూపించడం మామూలే. దీంతో స్క్రీన్‌పై విలన్ కనిపించిన ప్రతిసారి అభిమానులు ఆ క్యారెక్టర్‌ను తిట్టిపోసుకుంటారు. కానీ 'నాయకుడు' సినిమాలో అలా జరగలేదు. ఫ్యాన్స్ ఈ సినిమాలో హీరో కంటే విలన్ రత్నవేలు క్యారెక్టర్‌కే బాగా కనెక్టయ్యారు. సినిమాకు నిజమైన హీరో అతనే అంటూ కొనియాడుతున్నారు. తమిళ సినిమాల్లో ఇలా హీరో క్యారెక్టర్ కంటే విలన్లకు బ్రహ్మరథం పట్టడం ఇదేం తొలిసారి కాదు. దశాబ్దాలుగా అక్కడి ఇండస్ట్రీలో ఇటువంటి విలక్షణ విలన్ క్యారెక్టర్స్ ఎన్నో ప్రేక్షకాదరణ పొందినవే.
ఒక్కప్పటి కాలంలో తమిళంలో కరుడుకట్టిన విలన్ క్యారెక్టర్లకు నంబియార్ పెట్టింది పేరు. పాత్ర ఏదైనా సరే తనదైన శైలిలో నటించి ఒదిగిపోయే ఆయన.. విలనిజం కూడా ఓ రేంజ్లో పండించేవారు. అలా అప్పట్లోనే హీరో ఎంజీయార్తో సమంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత శ్రీదేవి, కమల్‌హాసన్ లీడ్ రోల్లో తెరకెక్కిన '16 వయధినిలే' సినిమాలో విలన్‌గా నటించిన రజనీకాంత్ ఊహించని స్థాయిలో క్రేజ్ పొందారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో విలన్ క్యారెక్టర్స్‌లో నటించారు. అయితే '16 వయధినిలే'లోని విలన్ క్యారెక్టర్‌కు వచ్చిన ప్రేక్షకాదరణ మరిదేనికి రాలేదు. అప్పట్లో సోషల్ మీడియా ఉండుంటే.. "ఇదు ఎప్పిడి ఇరుకు" అనే రజనీ ఫేమస్ డైలాగ్ ట్రెండ్ అయ్యి ఉంటుందన్న విషయంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.
ఇక రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్లో విలనిజం పండించి పేరొందిన వారిలో నటుడు సత్యరాజ్ ఒక్కరు. బాహుబలి కట్టప్పగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన.. తమిళంలో ఓ హీరోగా, ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఓ విలన్‌గా తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు. లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన కాకిచట్టై అనే తమిళ సినిమాలో సత్యరాజ్ విలన్ క్యారెక్టర్లో నటించి నయా ట్రెండ్ సృష్టించారు. ఇక అమైథి పాడై అనే సినిమాలో సత్యరాజ్ చేసిన విలన్ క్యారెక్టర్ గురించి ఎంత చెప్పిన చాలదు. ఆయన నటనతో విలనిజానికి కొత్త నిర్వచనం అందించారు
ఇక ఆ తర్వాత ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ నటించిన రత్నవేలు క్యారెక్టర్ తమిళ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతోంది. ఇలా ఒక్క విలన్ క్యారెక్టర్‌కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రేక్షకులకు దశాబ్దాల కాలం పట్టింది. ఎందుకంటే అలా హీరోలను డామినేట్ చేసి ప్రేక్షకాదరణ పొందిన విలన్ క్యారెక్టర్స్ సినిమాల్లో అరుదు. దీంతో ఇప్పుడు ఇలా హీరోల కంటే విలన్స్కే ఎక్కువ ప్రాధ్యానత ఇవ్వడం సరైనదా కాదా అనేది రానున్న తరాల వరకు వేచి చూడాల్సిందే అనేది విశ్లేషకుల అభిప్రాయం.