F3 movie song promo: అందరి 'ఫ్రస్టేషన్' పోగొట్టేందుకు, 'ఎఫ్ 2'కు మించిన 'ఫన్' పంచేందుకు 'ఎఫ్ 3' సినిమాతో రాబోతున్నారు వెంకటేశ్, వరుణ్‌తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ కథానాయికలు కాగా సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ ముగ్గురితోపాటు పూజాహెగ్డే అందం 'ప్రత్యేకం'గా నిలువనుంది. అయితే తాజాగా ఈ సినిమాలోని 'ఊ ఆ అహా అహా' అంటూ సాగే ప్రోమో సాంగ్‌ను రిలీజ్ చేసింది. పూర్తి లిరికల్ గీతాన్ని ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తానని తెలిపింది. దీనికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సునిధి చౌహాన్, లవిత లోబో, సాగర్, ఎస్పీ అభిషేక్ కలిసి దీన్ని ఆలపించగా.. కసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. కాగా, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రం మే 27న విడుదలకానుంది.
Kireeti new movie glimpse: సినీ, రాజకీయ ప్రముఖుల వారసులు వెండితెరకు పరిచయం కావటం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు నటీనటులు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి కర్ణాటక మాజీ మంత్రి, వ్యాపారవేత్త గాలి జనార్దన్‌రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి వచ్చి చేరిన సంగతి తెలిసిందే. కిరీటిని హీరోగా పరిచయం చేస్తూ.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కనుంది. దీన్ని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'వారాహి' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్లింప్స్‌ను.. బీటీఎస్(బిహైండ్ ది సీన్స్) అంటూ రిలీజ్ చేసింది మూవీటీమ్. ఇందులో కిరిటీ.. స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. సినిమాలోని అన్ని స్టంట్లను రియల్‌గానే చేసేందుకు ఆయన కసరత్తులు చేస్తున్నారు. కాగా, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించనుండగా.. ఆర్.రవీందర్ రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.