F3 Movie Promotions Varun Tej: వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన తాజా సినిమా 'ఎఫ్3'. తమన్నా, మెహరీన్ కథానాయికలు. దిల్ రాజు నిర్మించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మే27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుణ్ పంచుకున్న ఫన్నీ ముచ్చట్లేంటో చూద్దాం!
'గని' వచ్చిన వెంటనే 'ఎఫ్3' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎలా అనిపిస్తోంది?
వరుణ్ తేజ్: చాలా ఆనందంగా ఉంది. సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు. ఒక సినిమా విజయం సాధిస్తుందా? లేదా? అన్నది కేవలం ప్రేక్షకులు మాత్రమే నిర్ణయిస్తారు. 'ఎఫ్3' తీయాలని 'ఎఫ్2' షూటింగ్ సమయంలోనే అనుకున్నాం. దీని పూర్తి బాధ్యతను అనిల్ తీసుకున్నారు. ఆయన మీద మాకు నమ్మకం ఎక్కువ. ఈ సినిమా చిన్న పిల్లలకు కూడా నచ్చుతుంది.
'ఎఫ్3'లో మీ పాత్ర కోసం ఏమైనా సాధన చేశారా. 'ఎఫ్3' టీమ్‌తో నటించడం ఎలా అనిపించింది?
వరుణ్ తేజ్: కామెడీ చేయడం చాలా కష్టమని అర్థమైంది. మొదట చేయగలనా అని కంగారు పడ్డా. ఏ సన్నివేశంలో ఎలా నటించాలో అనిల్ దగ్గరుండి చెబుతారు. కాబట్టి అంత కష్టం ఉండదు. నాకు కొత్త వాళ్లతో మాట్లాడాలంటే కొంచెం మొహమాటం. కానీ ‘ఎఫ్3’లో అందరూ అంతకు ముందు చేసిన వాళ్లే అయ్యేసరికి షూటింగ్ వాతావరణం అలవాటైపోయింది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డబ్బునే ప్రేమిస్తారు. ‘ఎఫ్2’ చూడని వాళ్లు ఈ సినిమా చూసినా అర్థమవుతుంది. నాకు వ్యక్తిగతంగా వెంకటేశ్ అంటే చాలా ఇష్టం. రెండుసార్లు ఆయనతో కలిసి నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచే సునీల్ సినిమాలు చూసేవాడిని. ఆయన నాకు ఇష్టమైన కమెడియన్. దిల్‌రాజు నాకు చాలా క్లోజ్. సినిమాకు సంబంధించే కాకుండా విడిగా కూడా ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం.
టిక్కెట్ ధర విషయంలో తీసుకున్న నిర్ణయం మీ సినిమాకు కలిసివస్తుందంటారా?
వరుణ్ తేజ్: యూత్ సినిమాలకు ఒక్కొక్కరే వెళతారు. కానీ ఇలాంటి సినిమాలకు ఫ్యామిలీ అంతా కలిసి వస్తారు. ఇవి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్. అలా ఫ్యామిలీ అంతా వెళ్లాలంటే కొంతమందికి భారంగా ఉంటుంది. ఈ నిర్ణయం వాళ్లకి ఉపయోగపడుతుంది.
ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది?
వరుణ్ తేజ్:ప్రతి సినిమా ఇష్టమే. ఏ సినిమా అయినా దేనికదే ప్రత్యేకం. కొన్ని పాత్రలు చేయడం కష్టంగా ఉంటుంది. కొన్ని పాత్రలు చేయడం సులువుగా ఉంటుంది. ఏ సినిమా చేసినా పూర్తిగా న్యాయం చేస్తున్నానా లేదా అన్నది చూసుకుంటాను. కంచె సినిమాలో నేను చేసిన పాత్ర నాకు ఇష్టం.