Extraordinary Man Movie Review In Telugu :సినిమా: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, నటీనటులు: నితిన్, శ్రీలీల, రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, సంపత్ రాజా, బ్రహ్మాజీ, అజయ్, తదితరులు; సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ. విల్సన్, యువరాజ్, సాయి శ్రీరామ్; ఎడిటర్: ప్రవీణ్ పూడి; సంగీతం: హరీశ్ జయరాజ్; నిర్మాణ సంస్థ: శ్రేష్ఠ మూవీస్; నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి; రచన, దర్శకత్వం: వక్కంతం వంశీ; విడుదల తేదీ: 08-12-2023
టాలీవుడ్ హీరో నితిన్‌కు 'భీష్మ' తర్వాత మళ్లీ సరైన హిట్టు పడలేదు. మంచి అంచనాలతో బాక్సాఫీస్ ముందుకొచ్చిన 'రంగ్ దే', 'మాస్ట్రో', 'మాచర్ల నియోజకవర్గం' వంటి చిత్రాలు బాక్సాఫీసు ముందు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే విజయమే లక్ష్యంగా ఈసారి ఓ వినోదభరిత కథాంశాన్ని ఎంచుకున్నారు నితిన్. అదే 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. 'నా పేరు సూర్య' తర్వాత దర్శకుడిగా వక్కంతం వంశీ తెరకెక్కించిన రెండో చిత్రమిది. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ టీజర్, ట్రైలర్ వినోదభరితంగా ఉండటం వల్ల విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి 'ఈ ఎక్స్ట్రా ఆర్టినరీ మ్యాన్' అంచనాల్ని అందుకున్నాడు? ఈ చిత్రంతో నితిన్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారా? డైరెక్టర్‌గా వక్కంతం వంశీ మొదటి విజయాన్ని అందుకున్నారా? అనే విషయాలు తెలుసుకుందాం.
స్టోరీ ఎంటంటే?
అభి అలియాస్ అభయ్ (నితిన్)కు చిన్నప్పటి నుంచి మరో వ్యక్తిలా ఉండటమంటే ఇష్టం. ఆ వ్యక్తిత్వమే అతడిని జూనియర్ ఆర్టిస్ట్ అయ్యేలా చేస్తుంది. కానీ, తనకెంత ప్రతిభ ఉన్నా సినీ పరిశ్రమలో సరైన గుర్తింపు, గౌరవం దక్కదు. ఇక సినిమా షూటింగ్స్ల్లో దర్శకులెప్పుడూ అతన్ని కెమెరా లెన్స్‌కు దొరకనంత వెనకగానే నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలా సాదాసీదాగా సాగిపోతున్న అతని జీవితంలోకి లిఖిత (శ్రీలీల) వస్తుంది. ఆమె ఒక పెద్ద కంపెనీకి సీఈఓ. తనతో అభి ప్రేమలో పడ్డాక.. అతడి జీవితం మారిపోతుంది. లిఖిత వాళ్ల కంపెనీలో సీఈవో స్థాయికి చేరుకుంటాడు అభి. సరిగ్గా అదే సమయంలో అతనికి హీరోగా చేసే అవకాశం లభిస్తుంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉన్న కోటియా గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ అది. అందులోని రావణుడిలాంటి నీరో అలియాస్ నిరంజన్ (సుదేవ్ నాయర్) అనే ప్రతినాయకుడి ఆటకట్టించడానికి సైతాన్ అనే పోలీస్ ఎలాంటి సాహసాలు చేశాడన్నది ఆ కథలో కీలకాంశం. ఈ కథ అభికి విపరీతంగా నచ్చడం వల్ల తొలుత మూవీ చేయకూడదనుకుంటాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని ఆ చిత్రం కోసం ఉద్యోగాన్ని ప్రేమించిన అమ్మాయిని వదులుకొని కష్టపడతాడు. కానీ, తీరా సినిమా సెట్స్‌పైకి వెళ్లే సమయానికి దర్శకుడు అభిని కాదని మరో హీరోతో ఆ చిత్రం పట్టాలెక్కించాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో అభికి ఓ చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. తను విన్న కథలో ఉన్న ప్రతినాయకుడు నీరోతో నిజంగా తలపడాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికోసం తను దొంగ పోలీస్‌గా కోటియా గ్రామంలోకి అడుగు పెడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? కోటియా గ్రామాన్ని.. అక్కడి ప్రజల్ని నీరో బారి నుంచి రక్షించేందుకు అభి ఎలాంటి సాహసాలు చేశాడు? అతను నిజమైన పోలీస్ కాదని తెలుసుకున్న ఐజీ విజయ్ చక్రవర్తి (రాజశేఖర్) ఏం చేశాడు? ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్‌గా ఎలా పేరు తెచ్చుకున్నాడు? అన్నది ఆసక్తికరం.
సినిమా సాగిందిలా!
ప్రేక్షకుల్ని నవ్వించడమే లక్ష్యంగా చేసిన చిత్రమిది. అందుకే లాజిక్లను పక్కకు పెట్టి మరీ కథలో కామెడీ ట్రాక్‌లను వరుసగా పేర్చుకుంటూ వెళ్లిపోయారు దర్శకుడు వక్కంతం వంశీ. అయితే ఆ ట్రాక్‌లు ఎంత వినోదభరితంగా సిద్ధం చేసినా వాటిని కథలో సహజంగా ఇమడ్చలేనప్పుడు ఆ ప్రయత్నమంతా వృథా ప్రయాసే అవుతుంది. దీనికి ఈ కథే మంచి ఉదాహరణ. నిజానికి ఈ తరహా కథలు తెలుగు తెరపై చాలానే చూశాం. ఆ తెలిసిన స్టోరీలకే కొన్ని ట్విస్ట్‌లతో పాటు వినోదాన్ని జోడించి సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్. అయితే అది కొంత వరకు ప్రేక్షకుల్ని మెప్పించినా చిత్రం చూస్తున్న కొద్దీ నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఈ మూవీ ఓ మంచి ఛేజింగ్ సీన్‌తో, ఓ స్మగ్లర్‌కు హీరో తన కథ చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. జూనియర్ ఆర్టిస్ట్‌గా సెట్లో అభి ఎదుర్కొనే ఇబ్బందులు.. ఇంట్లో తన తండ్రితో పడే చివాట్లు.. అన్నీ సరదాగా ఉంటాయి. ఇక అభి జీవితంలోకి కథానాయిక ప్రవేశించాక సినిమా కాస్త నెమ్మదిస్తుంది. వీళ్లిద్దరి ప్రేమకథలో ఏమాత్రం ఫీల్ కనిపించదు. అయితే హీరోయిన్ ఇంటికి హీరో తొలిసారి వెళ్లినప్పుడు అక్కడే స్ఫూఫ్ సాంగ్స్‌తో చేసే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. బాలకృష్ణ చెంప దెబ్బల అంశం విజయ్ - రష్మికల లవ్ టాపిక్ నరేశ్ - పవిత్రా లోకేష్‌ల ప్రేమ అంశం ఇలాంటి ట్రెండింగ్ ఎలిమెంట్స్‌ని ఈ ఎపిసోడ్లో ఫన్నీగా మిక్స్ చేశారు. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను తీర్చిదిద్దుకున్న విధానం సెకండ్ హాఫ్‌పై ఆసక్తి పెంచేలా చేస్తుంది.