Rocking Rakesh Sujatha marriage కామెడీ టైమింగ్, వైవిధ్యమైన హావాభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు రాకింగ్ రాకేశ్. అందుకే చాలా తక్కువ కాలంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్‌లో టీమ్‌లీడర్ స్థాయికి చేరుకున్నాడు. మరోవైపు జోర్దార్ సుజాతగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సుజాత.. రాకేశ్ టీమ్ ద్వారా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్లో నవ్విస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వీరిద్దరూ తమ స్కిట్లలో కడుపుబ్బా నవ్విస్తూనే లవ్‌ట్రాక్‌ను నడిపించారు. మొదట ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌గా ప్రారంభించినా.. ఆ తర్వాత నిజజీవితంలోనూ ప్రేమపక్షులుగా మారారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన వీరికి సంబంధించిన విషయాలు, వీడియోలు తెగ ట్రెండింగ్ అవుతున్నాయి.
దీంతో వీరిద్దరూ ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ విషయమై ఆ జోడీ స్పందించింది. నేడు వినాయకచవితి పండుగను పురస్కరించుకుని 'మన ఊరి దేవుడు' అనే స్పెషల్ ప్రోగ్రామ్‌ను ఈటీవీ ప్రసారం చేసింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు జయప్రద, ప్రగతి, ఖుష్బూ, భగవాన్, నాగినీడు, ఇంద్రజ గెస్ట్లుగా విచ్చేసి తమ సంభాషణలతో నవ్వులు పూయించారు. ఈ క్రమంలోనే రాకేష్.. తన తమ్ముడి కుమార్తెకు పేరు పెట్టాలని అక్కడికి వచ్చిన గెస్ట్‌లను కోరగా.. అందరూ కలిసి నక్షత్ర అనే పేరు పెట్టారు. ఈ సందర్భంగా రాకేష్ తల్లి.. రాకేశ్ పెళ్లి గురించి మాట్లాడుతుంది. దీంతో అందరూ పెళ్లి ఎప్పుడు అని అడగ్గా 'శ్రీను అన్న చెబుతారు' అని రాకేష్ అంటాడు. అప్పుడు 'ఆమె ఎవరో కాదు మా బంధువు జోర్దార్ సుజాతతో త్వరలో పెళ్లి' అని ప్రకటిస్తాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉంటుందని చెబుతాడు.