"సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ప్రేమించినంతంగా మరెవరూ ప్రేమించలేరు. కథ బాగుంటే చాలు.. ప్రాంతీయ, భాషా భేదాల్లేకుండా ఆదరించి, ఆశీర్వదిస్తుంటారు".. ఇటీవల 'కేజీఎఫ్2' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కథానాయకుడు యశ్ అన్న మాటలివి. ఆయనే కాదు.. సూర్య, విక్రమ్, కార్తి, ధనుష్ తదితర తమిళ హీరోలు సైతం తరచూ ముక్తకంఠంతో చెప్పే మాటలివే. ఇవేమీ ప్రేక్షకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్న పొగడ్తలైతే కావు. వాస్తవం కూడా. మన వాళ్లకి కథ బాగుంటే చాలు.. అది తెలుగు చిత్రమా? డబ్బింగ్ బొమ్మా? అని ఆలోచించరు. అందుకే ఏడాదికి దాదాపు వంద వరకు అనువాద చిత్రాలైనా తెలుగు తెరలపై సందడి చేస్తుంటాయి. కొవిడ్ పరిస్థితుల వల్ల కొన్నాళ్లుగా డబ్బింగ్ చిత్రాల జోరు తగ్గింది. ఇప్పుడు తెలుగు సినిమాలకు దీటుగా.. అనువాదాలు సైతం బాక్సాఫీస్ ముందు జోరు చూపిస్తున్నాయి. అయితే వీటిలో ప్రేక్షకుల మెప్పు పొంది.. బాక్సాఫీస్ ముందు సత్తా చాటుతున్న చిత్రాలు మరీ అరుదైపోతున్నాయి.
అలా మెరిసి..ఇలా మాయమై
సాధారణంగా ఫిబ్రవరిలో తెలుగు నాట చిన్న చిత్రాల జోరు ఎక్కువ కనిపిస్తుంటుంది. ఈసారి అనువాద చిత్రాల సందడి ఎక్కువైంది. ఈనెల తొలి వారంలోనే ‘సామాన్యుడు’గా ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు విశాల్. తు.ప.శరవణన్ తెరకెక్కించిన యాక్షన్ చిత్రమిది. డింపుల్ హయాతి కథానాయికగా నటించింది. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్ని ఊరించిన ఈ సినిమా.. తెరపై ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఆ మరుసటి వారమే ఓటీటీ వేదికగా ‘మహాన్’తో సినీప్రియుల ముందుకొచ్చారు కథానాయకుడు విక్రమ్. దీంట్లో ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ మరో హీరోగా నటించారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ ఆదరణే దక్కింది. అయితే విక్రమ్ గత చిత్రాలతో పోల్చితే.. ఇది చాలా మెరగన్న మాటలు సినీప్రియుల నుంచి వినిపించాయి. ముఖ్యంగా తన తండ్రీతో పోటీ పడుతూ ధృవ్ కనబర్చిన నటనకు విమర్శకుల నుంచీ ప్రశంసలు దక్కాయి. తమిళంలో వైవిధ్యభరిత కథలకు చిరునామాగా నిలిచే హీరో విష్ణు విశాల్. ఆయన నటించిన ‘ఎఫ్‌ఐఆర్’ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో సమర్పించారు కథానాయకుడు రవితేజ. దీంతో ఈ చిత్రంపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మను ఆనంద్ తెరకెక్కించిన ఈ సీరియస్ యాక్షన్ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి టాక్ దక్కినా.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇక ఫిబ్రవరి నెలాఖరున ప్రేక్షకుల్ని పలకరించిన మరో పెద్ద అనువాద చిత్రం ‘వలీమై’. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాని హెచ్.వినోద్ తెరకెక్కించారు. ఇందులో తెలుగు యువ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. ప్రచార చిత్రాలతోనే సినీప్రియుల్ని విశేషంగా అలరించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు చేదు ఫలితాన్ని అందుకొంది. అయితే దీనికి తమిళ నాట చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు దక్కినట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించాయి.
జైత్రయాత్ర ఆగింది..