"బాలల దినోత్సవాన బాలల చిత్రాల్ని గుర్తు చేసుకుంటే సరిపోదు. పెద్దవాళ్లు చూస్తున్న చిత్రాల కంటే చిన్నారుల చిత్రాలే సమాజానికి అవసరం. ఒక కొత్త సమాజాన్ని సృష్టించేంత శక్తి సామర్థ్యాలు వాటికి ఉన్నాయి. సినిమాలతో పెద్దల్ని మార్చడం కష్టమేమోగానీ.. పిల్లలు మాత్రం సులభంగా ప్రభావితం అవుతారు. మరి ఏటా రెండు వేల చిత్రాలు నిర్మిస్తున్న భారతీయ చిత్ర పరిశ్రమ.. అందులో రెండు వందల బాలల సినిమాలైనా తీయకపోతే ఎలా? పాఠశాలల్లో సినిమా ఒక పాఠ్యాంశం కావాలి.
ఆయా తరగతులకి తగ్గట్టుగా ఏటా కొన్ని సినిమాల్ని విద్యార్థులకి చూపిస్తూ వాటి నుంచి ఎన్నో విషయాల్ని చెప్పే ఆస్కారం ఉంది. ప్రతి సబ్జెక్ట్‌నీ సినిమాతో చెప్పొచ్చు. మనం గుర్తు పెట్టుకున్నది మరిచిపోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ, తెలుసుకున్నది మాత్రం మరిచిపోలేం. భావోద్వేగాల్ని తెరపై ఆవిష్కరిస్తూ సినిమా తెలుసుకునే అవకాశం ఇస్తుంది. మన విద్యావ్యవస్థ గుర్తు పెట్టుకోవడం దగ్గరే ఆగిపోయింది. పిల్లలకి సినిమాతో నేర్పిస్తూ, విద్యావ్యవస్థ ప్రస్తుతం చేస్తున్న మంచి కంటే ఎక్కువగా మంచి చేసే అవకాశం ఉంది".
"సినిమా అనే ఒక అద్భుతమైన సాధనాన్ని వంద మంది చేతుల్లో పెట్టేసి, వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది అంటే లాభం లేదు. బాలల చిత్రాల్ని ప్రోత్సహించే బాధ్యతని ప్రభుత్వాలు తీసుకోవాలి. మంచి భావి సమాజాన్ని సృష్టించాలంటే అది చాలా అవసరం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరహాలో అగ్ర దర్శకులూ ఓ సామాజిక బాధ్యతగా భావించి, వాళ్ల జీవిత కాలంలో ఒక్క బాలల సినిమానైనా చేయాలి. కథానాయకులు కూడా అదే బాధ్యతని తీసుకోవాలి.
పవన్‌కల్యాణ్ ఒక చిన్న పిల్లల సినిమాలో నటిస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుంది? చిన్న కష్టానికే కుంగిపోకూడదనో, అబద్ధాలు చెప్పకూడదనో.. ఇలా ఓ చిన్న అంశాన్నే సినిమాతో చెప్పిస్తే అది పిల్లలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. తారలు, దర్శకులు అలా ముందుకొస్తే విద్యా సంబంధమైన అంశాలతో చిత్రాలు విరివిగా రూపొందే అవకాశం ఉంటుంది".