బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి మెగాఫోన్ పట్టారు. ఇప్పటికే మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కించిన అనుభవం ఉన్న ఈ బాలీవుడ్ భామ.. ఇప్పుడు స్వీయదర్శకత్వంలో దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్నారు. ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారణం, ఆ సమయంలో జరిగిన ఘటనలపై ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. గురువారం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ టీజర్‌ను రిలీజ్ చేశారు కంగనా. ఈ టీజర్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందిరా గాంధీగా కంగనా లుక్, హావభావాలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇందిరా గాంధీగా కంగనా.. మరోసారి మెగాఫోన్.. 'ఎమర్జెన్సీ' షూటింగ్ షురూ - కంగనా రనౌత్
ఎమర్జెన్సీ సినిమా టీజర్ రిలీజైంది. ఇందిరా గాంధీగా కంగనా లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు కంగనానే దర్శకత్వం వహిస్తున్నారు. ఎమర్జెన్సీ దేశ రాజకీయ చరిత్రలో కీలకపాత్ర పోషించిందని అందుకే ఈ కథ చెప్పాలనుకుంటున్నట్లు కంగనా వెల్లడించారు.
"ఎమర్జెన్సీ దేశ రాజకీయ చరిత్రలో చాలా కీలకమైన సమయం. అధికారంపై మనం చూసే కోణాన్ని మార్చేసింది. అందుకే ఈ కథను చెప్పాలనుకుంటున్నాను" అని కంగనా టీజర్ రిలీజ్ సందర్భంగా పేర్కొన్నారు. 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. 1977 వరకు దాదాపు 21 నెలల పాటు ఈ ఎమర్జెన్సీ కొనసాగింది. 'పింక్' ఫేమ్ రితీశ్ షా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగులు అందించగా.. కంగనా, రేణు పిట్టీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్నట్టు.. ఈ సినిమాకు కథ కూడా కంగనానే అందిస్తున్నారు. కంగనా.. ఇదివరకు దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితకథపై తెరకెక్కిన తలైవిలో కూడా ప్రధాన పాత్ర పోషించి మెప్పించారు.
ఇదీ చూడండి :మొదటి భార్య పేరు కలిసేలా.. దిల్‌రాజు కొడుకు పేరు..!