Eagle Movie Postponed :2024 సంక్రాంతికి ఐదు తెలుగు చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆ లిస్ట్‌లో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్ వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
సంక్రాంతి సినిమాల విడుదలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ గురువారం సమావేశమయ్యాయి. రోజుల వ్యవధిలోనే ఐదు సినిమాలు విడుదలైతే ఎలాంటి పరిణామాలుంటాయనే దానిపై ఆయా నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈగల్ నిర్మాత తమ సినిమా విడుదలను వాయిదా వేసేందుకు అంగీకరించారు. దీంతో గుంటూరు కారం (జనవరి 12), హనుమాన్(జనవరి 12), సైంధవ్ (జనవరి 13), నాగార్జున నా సామిరంగ (జనవరి 14) సంక్రాంతి బరిలో నిలవనున్నాయి.
రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రమే ఈగల్. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించారు. జనవరి 13న రావాల్సిన ఈ చిత్రానికి ఇప్పటికే సెన్సార్ పూర్తయింది. ఈగల్ వాయిదా పడే అవకాశాలున్నాయంటూ వచ్చిన వార్తలను చిత్ర బృందం కొన్ని రోజులుగా ఖండిస్తూ వచ్చింది. నిర్మాతలు కూడా ఈగల్ సంక్రాంతికి తప్పక విడుదల అవుతుందని ఇటీవలే స్పష్టం చేశారు. తాజా చర్చల అనంతరం వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నారు.