Dunki Title Meaning :బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'డంకీ'. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ డిసెంబర్ 21న విడుదలైంది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ అందుకుని థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పేరు చాలా కొత్తగా ఉందంటూ దీనికి అర్థం తెలుసుకునేందుకు నెట్టింట తెగ వెతికేశారు. అయితే తాజాగా దీని అసలు మీనింగ్‌ను హీరో షారుక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"డంకీ అనేది ఓ చట్టవిరుద్ధమైన ప్రయాణం. దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబీలోని ఓ సామెత ప్రకారం ఈ పేరు వచ్చినట్లు షారుక్ తెలిపారు. అంతే కాకుండా వాళ్లు దాన్ని డంకీ అంటారని అలా డంకీ రూట్ అనే పేరు వాడుకలోకి వచ్చింది" అని ఆయన వివరించారు.
సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించే వలసదారుల కారణంగా ఈ పద్ధతి పాపులరైంది. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి వలసదారులు చాలా మంది ఉన్నారట. ఇలా 'డంకీ ఫ్లైట్స్' పద్దతిలో అక్రమంగా వలస వెళ్తుంటారంటూ వార్తలు కూడా వస్తుంటాయి. అయితే డంకీ సినిమా వల్ల ఈ పేరు మరోసారి నెట్టింట మార్మోగింది. మరోవైపు 'శిద్ధత్', 'కామ్రేడ్ ఇన్ అమెరికా', 'ఆజా మెక్సికో చలియే' లాంటి సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కినవే.