తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'డంకీ'లో షారుక్ అందుకోసమే నటించారట - ఈ సినిమా గురించి ఈ విశేషాలు తెలుసా? - డంకీ మూవీ ఇంట్రెస్టింగ్​ ఫ్యాక్ట్స్

Dunki Movie Interesting Facts : బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్​ మూవీ 'డంకీ'. పాన్ ఇండియా లెవెల్​లో ఈ సినిమా డిసెంబర్​ 21న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విశేషాలు మీ కోసం

Dunki Movie Interesting Facts
Dunki Movie Interesting Facts

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 3:54 PM IST

Dunki Movie Interesting Facts :వరుస హిట్స్​ అందుకుని బాలీవుడ్​లో దూసుకెళ్తున్న స్టార్ హీరో షారుక్ ఖాన్ 'డంకీ' అనే మరో కామెడీ- డ్రామా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్రీ ఇడియెట్స్ ఫేమ్​ డైరెక్టర్ రాజ్​ కుమార్​ హిరానీ ఈ సినిమాను రూపొందించారు. పాన్ ఇండియా లెవెల్​లో ఈ చిత్రం డిసెంబర్​ 21న థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్​ కానుంది. ఈ సందర్భంగా ఆ మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు మీ కోసం.

  1. వసూళ్ల పరంగా షారుక్‌ ఖాన్‌ ఈ ఏడాది ఓ సరికొత్త రికార్డును సృష్టించారు. ఒకే ఏడాదిలో రెండు సినిమాల (పఠాన్‌, జవాన్‌)తో రూ. 1000 కోట్లకుపైగా (వేర్వేరుగా) వసూళ్లు సాధించిన హీరోగా చరిత్రకెక్కారు. అంత పెద్ద విజయాలు అందుకున్నప్పటికీ షారుక్‌కు సంతృప్తి లేదట. దీంతో ఈ డంకీ సినిమాను తన కోసం తాను నటించిట్లు షారుక్‌ ఒకానొక సందర్భంలో తెలిపారు. దీన్ని బట్టి ఈ స్టోరీ ఆయన మనసును ఎంతగా హత్తుకుందో అర్థం చేసుకోవచ్చు. 'పఠాన్‌', 'జవాన్‌'సినిమాలో యాక్షన్‌తో సందడి చేసిన షారుక్​, 'డంకీ' సినిమాతో నవ్వులు పంచుతూ భావోద్వేగానికి గురిచేయనున్నారు.
  2. డైరెక్టర్ రాజ్‌కుమార్‌ హిరాణీ- షారుక్‌ కాంబినేషన్‌లో రూపొందిన తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం. సోషల్ మెసేజ్​లు ఉన్న సినిమాలను రాజ్‌కుమార్‌ తెరకెక్కిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దానికి కామెడీ టచ్‌ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. 'మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌', 'త్రీ ఇడియట్స్‌', 'లగే రహో మున్నాభాయ్‌', 'పీకే', 'సంజు' లాంటి సినిమాల్లో సినిమాలన్నీ సూపర్‌ హిట్​ అయినవే. దీంతో అటు రెండు బ్లాక్‌బ్లస్టర్ల తర్వాత షారుక్‌ నటించిన చిత్రంకావడం, ఇటు పరాజయమే ఎరుగని హిరాణీ డైరెక్ట్‌ చేసిన సినిమా కావడం అంతే కాకుండా తొలిసారి ఈ ఇద్దరూ కలిసి పనిచేయడం ఇలా పలు కోణాల్లో 'డంకీ'పై అభిమానుల్లో భారీ అంచనాలే పెరిగిపోయాయి.
  3. మరోవైపు షారుక్‌- హీరోయిన్‌ తాప్సీ నటించిన తొలి మూవీ ఇదే. హీరో విక్కీ కౌశల్‌ ఈ సినిమాలో అతిథి పాత్ర పోషించడం విశేషం.
  4. ఇక 9 ఏళ్ల బ్రేక్ తర్వాత సీనియర్‌ స్టార్ సతీశ్‌ షా నటించిన చిత్రం ఇదే కావడం విశేషం. ఆయన నటించిన ఆఖరి చిత్రం 'హమ్‌షకల్స్‌'. ఇక బాలీవుడ్ నటుడు బొమాన్‌ ఇరానీ 'డంకీ'లో మరో కీలక పాత్రధారి.
  5. సుమారు 75 రోజుల్లో ఈ చిత్రీకరణ పూర్తవ్వగా అందులో షారుక్‌ ఖాన్‌ 60 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రీ ప్రొడక్షన్‌ దశ నుంచి రిలీజ్ వరకు ఈ సినిమాకు దాదాపు రెండున్నరేళ్ల సమయం పట్టిందని సమాచారం. ముంబయి, జైపుర్‌, కశ్మీర్‌, బుడాపెస్ట్‌, లండన్‌, జెద్దా తదితర ప్రాంతాల్లో ఈ సినిమాని చిత్రీకరించారు.
  6. ముందుగా ఈ సినిమాకి 'రిటర్న్‌ టికెట్‌', 'టాస్‌' ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టాలని డైరెక్టర్​ అనుకున్నారట. కానీ, చివరకు ఈ సినిమాకు 'డంకీ' అనే పేరును ఖరారు చేశారట. దీన్ని చాలామంది 'డాంకీ' అని అనేవారంటూ షారుక్‌ ఓ సందర్భంలో నవ్వులు పూయించారు.
  7. ఇక ఈ సినిమా ప్రొడక్షన్‌ కాస్ట్‌ రూ. 85 కోట్లు (నటులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్​ కాకుండా). గత ఆరేళ్లలో షారుక్‌ నటించిన వాటిలో అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఆర్టిస్ట్‌ల రెమ్యునరేషన్‌, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్‌ దాదాపు రూ. 120 కోట్లు.
  8. యు/ఏ సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందిన ఈ సినిమా నిడివి సుమారు 2:41 గంటలు. ముందుగా ఈ సినిమాని డిసెంబరు 22న విడుదల చేయాలంటూ మూవీ టీమ్ ప్లాన్ చేసింది. అయితే అదే రోజు రెబల్​ స్టార్ ప్రభాస్‌ 'సలార్‌' సినిమా విడుదల కావడం వల్ల 'డంకీ' విడుదల ప్రీపోన్‌ అయింది.
  9. దేశ సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్‌ అని అంటారు. అయితే పంజాబీ వాళ్లు దాన్ని 'డంకీ' అని పిలుస్తుంటారు. అలా భారత్‌ నుంచి ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించే స్నేహితుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
  10. మరి, వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లేంటి?అసలు వారు ఎందుకు అక్రమంగా వెళ్లాలనుకున్నారు? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ కాగా ఈ మూవీ టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. డిసెంబరు 21కి సంబంధించి రూ. 5 కోట్ల వ్యాపారం (డిసెంబరు 18 సాయంత్రం వరకు) జరిగిందని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details