Seetaramam Dulquer Salman: వైవిధ్య భరితమైన ప్రేమకథలు ఎంచుకుంటూ యువతరంలో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారు దుల్కర్ సల్మాన్. 'మహానటి'తో తెలుగు వారికి దగ్గరైన ఈ మలయాళ స్టార్.ఇప్పుడు 'సీతారామం'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రమిది. వైజయంతి మూవీస్ సమర్పణలో అశ్వినీ దత్ నిర్మించారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. రష్మిక, సుమంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం చిత్ర విశేషాలు పంచుకున్నారు దుల్కర్.
ప్రేమకథలు చెయ్యొద్దనే అనుకున్నా..!
''వరుసగా ప్రేమకథలు చేస్తూ వెళ్లడం వల్ల నాపై ప్రేక్షకుల్లో రొమాంటిక్ హీరో అన్న ఇమేజ్ పడిపోయింది. దాన్ని బ్రేక్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇకపై లవ్‌స్టోరీలకు దూరంగా ఉండాలనుకున్నా. హను రాఘవపూడి ఈ 'సీతారామం' కథ వినిపించాక.. నాకు నో చెప్పాలనిపించలే. కచ్చితంగా ఇది నేను చేసి తీరాల్సిందేనని నిర్ణయించుకున్నా. ఈ స్క్రిప్ట్ నాకంత స్పెషల్‌గా అనిపించింది. ఇదొక క్లాసిక్ ప్రేమకథ. ఓ ప్రత్యేకమైన కాలంలో జరుగుతుంటుంది. ఇలాంటి లవ్‌స్టోరీ నేనిప్పటి వరకు వినలేదు. ఈ తరహా కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. దీంట్లో స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహలకు ఏమాత్రం అందదు. ట్రైలర్‌లో చూపించింది ఈ సినిమాలోని ఓ చిన్న గ్లింప్స్ మాత్రమే. తెరపై చూసినప్పుడు అందరికీ గొప్ప అనుభూతి దొరుకుతుంది. ఇందులో బోలెడన్ని సర్‌ప్రైజ్‌లున్నాయి''.
మలుపు తిప్పే లేఖ..
''ఈ చిత్రంలో నేను లెఫ్ట్‌నెంట్ రామ్‌గా కనిపిస్తా. తనొక అనాథ. దేశభక్తి ఉన్న కుర్రాడు. సాఫీగా సాగిపోతున్న అతని జీవితాన్ని ఓ లేఖ మలుపు తిప్పుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ఈ కథ వినగానే సీతామహాలక్ష్మి పాత్రకు ఎవరు సరిపోతారా అనుకున్నా. ఈ పాత్రకు మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నామని హను, స్వప్న చెప్పినప్పుడు ఓకే అనుకున్నా. కానీ, సెట్లో సీత కాస్ట్యూమ్‌లో మృణాల్‌ను చూశాక.. ఈ పాత్రకు తను కాకుండా ఇంకెవ్వరూ సెట్ అవ్వరనిపించింది. సినిమాలో తనెంతో అద్భుతంగా నటించింది. ఈ చిత్రంలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యముంది. విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన గీతాలందించారు. ఆ పాటలు వింటున్నప్పుడు 80ల కాలంలోకి వెళ్లినట్లు ఉంటుంది. పాటలనే కాదు.. నేపథ్య సంగీతమూ చాలా కొత్తగా ఉంటుంది. దీంట్లో నాకు చాలా బాగా నచ్చిన పాట 'కానున్న కల్యాణం'. కశ్మీర్‌లోని అందమైన లొకేషన్లలో.. గడ్డకట్టే చలిలో ఎంతో కష్టపడి చిత్రీకరించిన పాటిది.