విడుదలైన అన్నీ భాషల్లోనూ సంచలనాలు సృష్టించిన సినిమా 'దృశ్యం'. మొదట్లో మలయాళంలో రిలీజైన ఈ సినిమా అదే పేరుతో తెలుగులో వచ్చి హిట్ టాక్ అందుకుంది. ఇక హిందీలో 'దృశ్యం'గా, కన్నడలో 'దృశ్య'గా, తమిళంలో 'పాపనాశనం' పేరుతో తెరకెక్కి అన్నింటిలోనూ సత్తా చాటింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన 'దృశ్యం 2' కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ 'దృశ్యం' సిరీస్ కొరియన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం కానుంది. దీని కోసం ప్రముఖ ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్, దక్షిణ కొరియాకు చెందిన సంస్థ ఆంథాలజీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 'కేన్స్ ఫెస్టివల్' వేదికగా అధికారికంగా ఈ ప్రకటన వెలువరించింది మూవీ టీమ్. పారాసైట్ నటుడు సాంగ్ కాంగ్-హో ఈ చిత్రంలో నటించనున్నారు. కొరియన్ చిత్ర పరిశ్రమలో రీమేక్ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా 'దృశ్యం' రికార్డు సృష్టించింది.
ముందుగా.. 'దృశ్యం' సినిమాను మోహన్‌లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ మలయాళంలో తెరకెక్కించారు. అయితే ఇదే సినిమాను తెలుగులో వెంకటేశ్ హీరోగా శ్రీప్రియ పార్ట్ 1 తెరకెక్కించగా, పార్ట్ 2ను జీతూ జోసెఫ్ రూపొందించారు. ఇక హిందీ దృశ్యంలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. వేర్వేరు దర్శకులు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక తమిళంలో కమల్‌హాసన్, గౌతమి ప్రధాన పాత్రధారులగా తెరపై కనిపించారు. ఇక ఈ సినిమా కొరియన్ వెర్షన్లో హీరో రోల్లో 'పారసైట్' నటుడు సాంగ్ కాంగ్ హో కనిపించనున్నారు. ప్రముఖ కొరియన్ దర్శకుడు కిమ్ జీ ఊన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.