drishyam 3 announcement వరుసగా వచ్చిన 'దృశ్యం' చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. మలయాళంలో జీతూజోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలు తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ పునర్నిర్మితం అవుతూ ప్రేక్షకుల్ని మెప్పించాయి. అనుకోకుండా జరిగిన ఓ హత్య చుట్టూ సాగే కుటుంబ కథలు ఇవి. మలయాళంలో మోహన్‌లాల్ నటించగా, తెలుగులో వెంకటేష్ కథానాయకుడు. కథానాయకుడు తన సినిమా తెలివి తేటల్ని ఉపయోగిస్తూ పోలీసుల చేతికి దొరక్కుండా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ రావడమే ఈ కథ. ఈ కథకి ముగింపుగా మూడో భాగం సిద్ధమవుతోంది. త్వరలోనే దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు పోస్టర్ ద్వారా సినీ వర్గాలు తెలిపాయి. ఆ పోస్టర్‌లో మోహన్‌లాల్ సంకెళ్లతో కనిపిస్తున్నారు. మరి ఈసారి కథానాయకుడు పోలీసులకి దొరికాడా లేక తప్పించుకున్నాడా? అనేది ఆసక్తికరం. ఈ సినిమా తెలుగులోనూ రీమేక్ అయ్యే అవకాశాలున్నాయి.
బుజ్జీ హంగామా ఇలా: సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బుజ్జీ.. ఇలా రా'. చాందినీ అయ్యంగార్ కథానాయిక. 'గరుడవేగ' అంజి దర్శకత్వం వహించారు. జి.నాగేశ్వర్‌రెడ్డి కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మాతలు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. కథానాయకుడు అల్లరి నరేష్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ "నాకు ఇష్టమైన దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి. విజయవంతమైన 'సీమశాస్త్రి', 'సీమటపాకాయ్' సినిమాల్నిచ్చారు నా కెరీర్‌కి! అంజి ఛాయాగ్రాహకుడు కాకముందు నుంచే నాకు తెలుసు. తనకి దర్శకత్వంపై ఆసక్తి ఉందని ఎప్పట్నుంచో చెప్పేవారు. జి.నాగేశ్వర్‌రెడ్డి కథతో, అంజి ఈ సినిమా తీశారంటే కచ్చితంగా బాగుంటుందని నమ్మకం" అన్నారు. జి.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ "కథ బాగుంటే సరిపోదు. నటీనటులు కీలకం. సునీల్, ధన్‌రాజ్ తదితర నటుల వల్ల ఈ సినిమా అద్భుతంగా ముస్తాబైంది. ఈ సినిమా విజయంతో అంజికి మంచి పేరు రావాలి. సినిమా ఆడకపోతే ఆ చెడ్డ పేరు నాకు రావాలని కోరుకుంటాను. ఈ సినిమాకి అసలైన హీరోలు నా స్నేహితులైన నిర్మాతలే" అన్నారు.