నందమూరి నట వారసుడిగా 'నిన్ను చూడాలని' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు తారక్. పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర(1991)తో బాల నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే తాతను పోలిన రూపంలో కనిపించడంతో అంతా జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు. అదే ఆయన స్క్రీన్ నేమ్‌గా స్థిరపడింది.
రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం.. ఇలా నవరసాలను అలవోకగా పండించగలిగే నటుల్లో ఆయన ఒకరు. అందుకే 'నటనలో నీ తర్వాతే ఎవరైనా' అని అంటారు ఆయన సినిమాలను చూసిన వారందరూ. సింగిల్ టేక్‌లో భారీ సంభాషణలు చెప్పదగ్గ, అదిరిపోయే స్టెప్పులు వేయగలిగే నటుడాయన. గుక్క తిప్పుకోకుండా భారీ డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్‌కు సరిసాటి ఎవరూ రాలేరు. డైలాగ్ డెలివరీ గాని, డాన్స్‌లో జోష్, ఫైట్స్‌లో ఎన్టీఆర్ స్పీడ్‌కు సిల్వర్‌స్క్రీన్ సైతం ఊగిపోవాల్సిందే.
కెరీర్ల ఆరంభంలోనే ఆది, సింహాద్రి చిత్రాలతో మాస్ హీరోగా ప్రేక్షకుల మనసును కొల్లగొట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రాల సక్సెస్‌తో ఎన్నో అవకాశాలను అందుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్‌గా నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.