'నాయకుడు', 'దళపతి', 'రోజా', 'బొంబాయి', 'ఇద్దరు'.. ఇలా భారతీయ సినీప్రియులకు ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని అందించిన దర్శకుడు మణిరత్నం. ఇప్పుడాయన నుంచి రానున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. ఇది మణిరత్నం కలల సినిమా. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా రూపొందింది. చోళుల కాలం నాటి ఆసక్తికర కథాంశంతో పీరియాడికల్ సినిమాగా ముస్తాబవుతోంది. మణిరత్నం గతంలో ఎన్నోసార్లు ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్రయత్నించారు. బడ్జెట్ సమస్యల వల్ల అతి కార్యరూపం దాల్చలేదు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్‌బాబును సంప్రదించినట్లూ వార్తలు వినిపించాయి. అయితే భాగస్వామ్య పద్ధతిలో ఈ సినిమా నిర్మించేందుకు లైకా సంస్థ ముందుకు రావడంతో.. మూడేళ్ల క్రితం ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం పట్టాలెక్కింది. ఇప్పుడు దీన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న తొలి భాగం.. ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇందులో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
కమల్ జోరు.. 'విక్రమ్'తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు కథానాయకుడు కమల్‌హాసన్. ఇప్పుడీ జోష్‌లోనే ఇన్నాళ్లు అటకెక్కిన తన కలల ప్రాజెక్టుల్ని ఒకొక్కటిగా పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్స్‌లో 'మరుదనాయగం', 'మర్మయోగి' సినిమాలతో పాటు 'శభాష్ నాయుడు' అనే మరో చిత్రం ఉన్న సంగతి తెలిసిందే. 'దశావతారం'లోని బలరామ్ నాయుడు పాత్ర ఆధారంగా ఈ కథని తీర్చిదిద్దారు. 2016లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా.. ఆ తర్వాత బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని కమల్ తిరిగి పట్టాలెక్కించనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. దీన్ని ఆయన తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇందులో ఆయన తనయ శ్రుతిహాసన్ మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 'భారతీయుడు2' పూర్తయిన వెంటనే ఇది సెట్స్‌పైకి వెళ్లనుందని ప్రచారం వినిపిస్తోంది.